MS Dhoni: ధోనీతో చేయి కలిపేందుకు నిరాకరించిన నటరాజన్ కుమార్తె... వీడియో వైరల్!

SRH bowler Natarajan daughter denied a shake hand with MSD
  • నిన్న సీఎస్కే, సన్ రైజర్స్ మ్యాచ్
  • మ్యాచ్ ముగిశాక ధోనీతో మాట్లాడిన సన్ రైజర్స్ ఆటగాళ్లు
  • ధోనీని కలిసిన నటరాజన్ కుటుంబం
  • నటరాజన్ కుమార్తెను ఆకట్టుకునేందుకు ధోనీ పాట్లు
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గతరాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ధోనీతో ముచ్చటించడం, ఆటపై ధోనీ సలహాలు, సూచనలు తీసుకోవడం సర్వసాధారణంగా కనిపించే అంశం. నిన్నటి మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అదే దృశ్యం ఆవిష్కృతమైంది. 

మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ ఆటగాళ్లు ధోనీ క్రికెట్ పరిజ్ఞానం నుంచి తమకు అవసరమైన విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేశారు. ధోనీ కూడా ఎంతో ఓపిగ్గా వారికి ఆటకు సంబంధించిన విషయాలను బోధించాడు. ఈ సందర్భంగా, ఒక ఆసక్తికర ఘటన జరిగింది. 

సన్ రైజర్స్ బౌలర్ టి.నటరాజన్ తన భార్య, కుమార్తెతో కలిసి ధోనీ వద్దకు వచ్చాడు. నటరాజన్ కుమార్తెను చూడగానే ధోనీ చిరునవ్వు చిందిస్తూ చేయి కలిపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చిన్నారి... ధోనీతో చేయి కలిపేందుకు నిరాకరించింది. ఆ పాపను ఆకట్టుకునేందుకు ధోనీ అనేక కబుర్లు చెప్పినా ఫలితం లేకపోయింది. 

చేతులు వెనక్కి పెట్టుకున్న ఆ చిన్నారి... ఎంత ప్రయత్నించినా ధోనీతో మాత్రం చేయి కలపలేదు. చివరికి ధోనీ... నటరాజన్ కుటుంబంతో ఓ ఫొటో దిగి అక్కడ్నించి నిష్క్రమించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
MS Dhoni
Natarajan
Daughter
Chennai
CSK
SRH
IPL

More Telugu News