Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది

  • అజయ్ భల్లాకు ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్
  • ఈ దాడికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి
  • గవర్నర్ కూ ఫిర్యాదు, వీడియోలను పంపించిన టీడీపీ!
TDP complaints Union Home Ministry over stone attack on chandrababu naidu

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా జరిగిన రాళ్ల దాడి ఘటనకు తెలుగు దేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఫిర్యాదు చేశారు.

వీఐపీ భద్రత కోసం ఉన్న పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోలీసుల సానుభూతి వ్యవహారం పట్ల విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశం పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటనలను కూడా ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు లక్ష్మీనారాయణ. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు.

యర్రగొండపాలెంలో నిన్న జరిగిన ఘటనను టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఉదయం నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించి గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్నటి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలను గవర్నర్ కు పంపించినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, ఈ రాళ్ల దాడి ఘటనలో ఎన్ఎస్‌జీ కమాండెంట్ కు గాయాలయ్యాయి. ఈ అంశంపై ఎన్ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్ ను స్కానింగ్ కు తరలించారు. ఆందోళనకారులు చంద్రబాబుకు సమీపంగా రావడంపై ఎన్ఎస్‌జీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

More Telugu News