tayattu mahima: ‘తాయత్తు’ వ్యాఖ్యల వివాదం.. స్పందించిన తెలంగాణ డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు!

  • తాయత్తు వల్లే ఈ స్థాయిలో ఉన్నానని ఇటీవల చెప్పిన డీహెచ్ శ్రీనివాస్
  • తన వ్యాఖ్యలను ఇంత వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్య 
  • పూర్వం ఉన్న నమ్మకాన్ని గుర్తు చేశానని వెల్లడి
  • కరోనా సమయంలో మందులిచ్చామే గానీ తాయత్తులు కట్టుకోమని చెప్పలేదని వివరణ
telangana health director gadala srinivasa rao explanation for his controversial remarks

చిన్నప్పుడు కట్టుకున్న తాయత్తు మహిమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. డాక్టర్ గా ఉన్నత పదవిలో ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన కామెంట్లపై శ్రీనివాసరావు తాజాగా వివరణ ఇచ్చారు.  

మనిషిని నమ్మకమే బతికిస్తుందని తాను గుర్తుచేసుకున్నానని ఆయన తెలిపారు. ‘‘సైన్స్ అండ్ టెక్నాలజీని తక్కువ చేసి నేను ఏనాడూ మాట్లాడలేదు. నమ్మకంతోనే మనిషి నవ నాగరిక సమాజాన్ని నిర్మించుకుంటున్నాడు. కరోనా సమయంలో మందులు, వ్యాక్సిన్లు ఇచ్చామే గాని.. తాయత్తులు కట్టుకోమని చెప్పలేదు. పూర్వం ఉన్న నమ్మకాన్ని గుర్తు చేశాను’’ అని చెప్పుకొచ్చారు.  

కనిపిస్తున్న సత్యం ఆవగింజ అయితే... కనిపించని నమ్మకం విశ్వమంత అని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. నమ్మకం కాస్తా మూఢ నమ్మకంగా మారిందని అన్నారు. తన వ్యాఖ్యలను ఇంత వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. 

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గత సోమవారం రాత్రి జరిగిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘చిన్నతనంలో నాకు దెబ్బ తగిలి రక్తస్రావమైంది. ఆసుపత్రికి తీసుకెళితే పరిస్థితి సీరియస్ గా ఉందని, తాము ప్రయత్నం మాత్రమే చేస్తామని, అంతా ఆ భగవంతుడి దయ అంటూ వైద్యులు ఒక రకంగా చేతులెత్తేశారు. తర్వాత మా తాత దగ్గర్లోని ఒక మసీదుకు తీసుకెళ్లి మౌలాసాబ్‌తో ఒక తాయత్తు కట్టించారు. ఫలితంగా కొన్నిరోజులకు నాకు గాయాలు తగ్గాయి. ఆ తాయత్తు మహిమతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా’’ అని చెప్పారు. 

అంతకు ముందు ఫిబ్రవరి 12న ఓ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘‘నేను భద్రాచలం ఏరియాకు చెందిన వాడిని. నా పెరుగుదల అంతా అన్నల అడుగుజాడల్లో జరిగింది. గన్‌ పట్టుకొనే వాడిని, దారితప్పి స్టెతస్కోప్‌ పట్టుకున్నా. ఒకవేళ అన్నల్లో కలిసిపోయి గన్‌ పట్టుకొని ఉంటే.. ఈ పాటికి శ్రీనివాస్‌ అమర్‌ రహే అనే వారు’’ అని అన్నారు.

More Telugu News