High Court: దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దంటూ పిటిషన్లు... కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి హైకోర్టు నోటీసులు

  • తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేసిన భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి 
  • నేడు వాదనలు విన్న న్యాయస్థానం 
  • తదుపరి విచారణ జూన్ 3వ వారానికి వాయిదా
High Court sent notices to Dastagiri for approver

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారించింది. దస్తగిరిని అప్రూవర్ గా మార్చవద్దని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణను జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో తాను, సునీల్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలం పాల్గొన్నామని, ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని దస్తగిరి తన వాంగ్మూలంలో పాల్గొన్నాడు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారని, ఎర్ర గంగిరెడ్డి వల్లే ఓడిపోయిన కోపం ఉందని, అదే సమయంలో బెంగళూరులో స్థలంపై పంచాయతీకి పలుమార్లు వివేకా వెళ్లేవారని, ఆ స్థలంలో ఎర్ర గంగిరెడ్డి వాటా అడిగితే వివేకా ఆగ్రహించారని పేర్కొన్నాడు. 2018లో తాను వివేకా వద్ద పని మానివేశానని, తాము అందరం కలిసేవాళ్లమని, 2019 ఫిబ్రవరి 2న తాము ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళ్లామని చెప్పాడు. వివేకాను చంపాలని తమకు ఆయన సూచించినట్లు చెప్పాడు.

హత్య చేయమని చెప్పగా తాను ససేమీరా అన్నానని, వారు కూడా వస్తానని చెప్పారని తెలిపాడు. ఈ హత్యలో పెద్దల ప్రమేయం ఉందన్నాడు. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఉన్నారని, శంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని, అందులో రూ.5 కోట్లు తనకు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడన్నాడు. మార్చి 14న తాము వివేకా ఇంటికి వెళ్లి, గొడ్డలితో దాడి చేశామని చెప్పాడు. హత్య తర్వాత తాము గోడ దూకి పారిపోయినట్లు చెప్పాడు. కాగా దస్తగిరి గత ఏడాది ఆగస్ట్ 30న పొద్దుటూరు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు.

More Telugu News