India: హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో రోజుకు 3000కు పైగా వీసా అప్లికేషన్స్: కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్

New US consulate in Hyderabad can process more than 3000 visa applications
  • మూడు రెట్లు పెరిగిన అమెరికా కాన్సులేట్ సామర్థ్యం
  • 16 నుండి 54కు పెరిగిన కాన్సులర్ విండోలు
  • దక్షిణాసియాలో అతిపెద్ద క్యాంపస్‌గా రికార్డ్ 
  • విద్యార్థి వీసాల ప్రక్రియ వేగవంతం
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ప్రారంభమైన అమెరికా కాన్సులేట్ నూతన కార్యాలయంలో రోజుకు 3000 నుండి 3500 మంది వరకు సేవలు పొందవచ్చునని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ వెల్లడించారు. ఇక్కడ తమ కాన్సులేట్ సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరగనున్నదని చెప్పారు. ఇదివరకు బేగంపేటలో కాన్సులేట్ ఉన్నప్పుడు స్థలం, సిబ్బంది కొరత కారణంగా రోజుకు 1100 దరఖాస్తులు ప్రాసెస్ అయ్యేవని, కొత్త కార్యాలయంలో 3000కు పైగా ప్రాసెస్ చేయవచ్చునన్నారు. 2007లో ప్రారంభమైన బేగంపేట కార్యాలయంలో 16 కాన్సులర్ విండోల ద్వారా తక్కువ దరఖాస్తుల ప్రాసెస్ జరిగేదని, కొత్త కార్యాలయంలో 54 విండోల ద్వారా 3000 నుండి 3500 ప్రాసెస్ అవుతాయన్నారు.

ప్రస్తుతం కాన్సులర్ విండోలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని, అన్ని విండోల ద్వారా సేవలు అందించేలా సిబ్బంది సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు చెప్పారు. సామర్థ్యం పరంగా దక్షిణాసియాలో అతిపెద్ద క్యాంపస్‌గా తమ కాన్సులేట్‌ రికార్డ్ సృష్టించిందన్నారు. తాత్కాలిక ఉద్యోగాల కోసం గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్లిన దక్షిణాసియావాసుల్లో డెబ్బై శాతం మంది భారతీయులని, భారత్ లోని ఐదు కాన్సులేట్ లలో కలిపి ఈ ఏడాది కనీసం పది లక్షల మంది భారతీయులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విద్యార్థి వీసాల ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
India
USA
Hyderabad

More Telugu News