India: జనాభా పెరుగుదలతో స్థలాలకు కొరత.. ఒక్కొక్కరికి అర ఎకరం

  • కిలోమీటర్ పరిధిలో 434 మంది నివాసం
  • చైనాతో పోలిస్తే జనసాంద్రత మన దగ్గర రెండు రెట్లు అధికం
  • భవిష్యత్తులో తగ్గిపోయే సాగుతో ఆహార సంక్షోభ ప్రమాదం
India No 1 in population No 7 in size in world but how much land do you hold

ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశంగా భారత్ ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. చైనా జనాభా 142.57 కోట్లుగా ఉంటే, దాన్ని వెనక్కి నెట్టేసి 142.86 కోట్లతో భారత్ ముందుకు చేరింది. అధిక జనాభా వల్ల అనుకూలతలే కాదు, ప్రతికూలతలూ ఉంటాయి. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడం కష్టమవుతుంది. దిగుమతులపై ఆధారపడడం పెరుగుతుంది. పెరిగే జనాభాకు తగ్గ ఉపాధి అవకాశాల సృష్టి పెద్ద సవాలుగా మారుతుంది. ధనిక, పేద మధ్య అంతరాలు మరింత పెరుగుతాయి. 

నిజానికి చైనాతో పోలిస్తే మన దేశంలో జనసాంద్రత చాలా ఎక్కువ. చైనాలో ప్రతి చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించే వారి సంఖ్య 151.3గా ఉంటే, మన దేశంలో 434.6 మంది నివాసం ఉంటున్నారు. అంటే చైనాతో పోలిస్తే రెండు రెట్లు జనసాంద్రత మన దగ్గర అధికం. మరి మన దేశంలో ఉన్న భూమిని అందరికీ పంచితే ఒక్కో వ్యక్తికి 2,301 చదరపు మీటర్లు (0.0023 చదరపు కిలోమీటర్లు) లభిస్తుంది. అంటే సుమారు అర ఎకరం. దీన్ని తలసరి భూమిగా చూడాలి. ముందు ముందు మన జనాభా మరింత పెరుగుతుంది. కనుక ఈ తలసరి భూభాగం ఇంకా తగ్గిపోనుంది. చైనాలో తలసరి భూభాగం 0.0066 చదరపు కిలోమీటర్లుగా ఉంటే, అమెరికాలో 0.0269 చదరపు కిలోమీటర్లుగా, పాకిస్థాన్ లో 0.00321 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 

భారత్ జనాభా పదేళ్లలో 154.8 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. దాంతో చదరపు కిలోమీటర్ పరిధిలో జనసాంద్రత 470.8కి పెరగనుంది. ‘‘భారత్ జనాభా 1.4 బిలియన్ కాగా, భారత్ ముందు 1.4 బిలియన్ అవకాశాలున్నాయి. 15-24 ఏళ్లలోపు వయసున్న 25.4 కోట్ల మంది యువత ఉండడం ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు అవకాశం’’ అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. తలసరి భూభాగం తగ్గిపోవడం వల్ల సాగుపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. పెరిగే జనాభాతో భూముల నిల్వలు చిన్నగా మారతాయని, ఇతర అవసరాలకు భూ మళ్లింపులు పెరుగుతాయని తెలిపింది. దీంతో ఆహారోత్పత్తుల కొరత కూడా ఏర్పడవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News