Bengaluru: బెంగళూరులో అద్దె ఇంటి కష్టాలకు ప్రబల నిదర్శనం ఇదే!

  • ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా పెరిగిపోయిన అద్దెలు
  • రూ.60 వేలు పెట్టినా 2బీహెచ్ కే లభించని పరిస్థితి
  • అద్దె ఇల్లు కావాలంటూ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్లకార్డు ప్రదర్శన
Why did this Bengaluru man go house hunting during IPL match

ఇటీవలి కాలంలో బెంగళూరులో కిరాయిదారులు పడుతున్న కష్టాలపై పలు వార్తలు ప్రసారం అవుతున్నాయి. అద్దెలు భారీగా పెరిగిపోవడంతో కిరాయిదారులు లబోదిబోమంటున్నట్టు.. ఉద్యోగం కంటే ఎక్కువగా పరిశీలన చేసిన తర్వాతే ఇంటిని యజమానులు కిరాయికి ఇస్తున్న వార్తలు వింటున్నాం. ఐటీ రాజధానిగా వందలాది బహుళజాతి సంస్థలకు కేంద్రంగా వెలిగిపోతున్న బెంగళూరులో సొంతిల్లు లేకపోతే, కష్టాలు పడాల్సి వస్తుందనేందుకు ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి.

అతిన్ బోస్ అనే ఓ ప్రొడక్ట్ డిజైనర్ ఇటీవలే బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఓ పింక్ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. ‘ఇందిరానగర్ లో 2బీహెచ్ కే ఇంటి కోసం చూస్తున్నాను’ అని దానిపై రాసుకొచ్చాడు. అదేదో ప్రచారం కోసం చేసిన పని అనుకునేరు. ఆ రూపంలో అయినా తనకు ఇందిరానగర్ లో ఓ అద్దెల్లు లభిస్తుందన్న చిన్న ఆశతో చేసిందే అది. 

బ్రహ్మచారి అయిన బోస్ ప్రస్తుతం ఇందిరాగనర్ లోనే, మరో స్నేహితుడితో కలసి రూ.35,000 అద్దెకు రెండు పడక గదుల ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ‘‘ప్రస్తుతం నేను ఉంటున్న ఇంటి యజమాని ఒక్కసారిగా అద్దెను 60 శాతం పెంచేశాడు. ఇప్పుడు ఇందిరాగనర్ లో రూ.60 వేల లోపు అద్దెకు ఇల్లు లభించని పరిస్థితి ఉంది. రూ.80 వేలు పెట్టినా కష్టంగానే ఉంది’’ అని బోస్ మీడియాకు తెలిపాడు. 

బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాలుగా పేరున్న ఇందిరానగర్, వైట్ ఫీల్డ్, ఐటీ కారిడార్లలోని మారతనహళ్లి, బెల్లండూర్, సార్జాపూర్, హెబ్బళ్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 20-30 శాతం వరకు పెరిగాయి. అమిత్ బోస్ రెండు నెలలుగా ఇందిరానగర్ ప్రాంతంలో అద్దె ఇంటి కోసం గాలిస్తున్నాడు. రూ.60వేలు పెట్టినా దొరకడం లేదని, పెళ్లి కాని వారి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకొచ్చాడు. వైట్ ఫీల్డ్, మహదేవపుర, బ్రూక్ ఫీల్డ్ తదితర ప్రాంతాల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నట్టు బ్రోకర్లు చెబుతున్నారు.

More Telugu News