Andhra Pradesh: పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన.. శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ ప్రకటన

  • త్వరలో విశాఖకు వచ్చేస్తున్నానన్న ముఖ్యమంత్రి జగన్
  • రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరణ
  • పేదల పక్షాన మీ బిడ్డ పోరాడుతున్నాడని సీఎం వ్యాఖ్య  
from september onwards administration will be shifted to vizag says ap cm jagan

శ్రీకాకుళం జిల్లా మూలపేట వేదికగా ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన కొనసాగుతుందని వెల్లడించారు. త్వరలో విశాఖకు వచ్చేస్తున్నానని, అక్కడే ఉంటూ పాలన కొనసాగిస్తానని చెప్పారు. మూలపేట పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం అని సీఎం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ వైషమ్యాలు పోవాలనే తపనతో అన్ని జిల్లాలను, ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి యుద్ధం జరుగుతోందని, పెత్తందార్ల వైపు నిలబడ్డ వారితో పేదల పక్షాన నిలబడ్డ మీ బిడ్డ పోరాడుతున్నాడని చెప్పారు. మీ బిడ్డ ఒక్కడే వారితో పోరాడుతున్నాడని, ఈ యుద్ధంలో మీ బిడ్డకు అండగా నిలవాలని కోరుతున్నానంటూ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తోడేళ్లన్నీ ఏకమైనా సరే.. దేవుని దయ, మీ ఆశీస్సులు ఉన్నంత వరకూ తనకు భయంలేదని జగన్ చెప్పారు.

More Telugu News