Margadarsi: డిపాజిటర్ల సొమ్ము చెల్లింపు వివరాలు ఇవ్వండి: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

  • సేకరించిన సొమ్మును మార్గదర్శి ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేయలేదన్న ఉండవల్లి
  • ఇది ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించడమేనన్న మాజీ ఎంపీ
  • డిపాజిటర్లందరికీ సొమ్ము తిరిగి చెల్లించామన్న మార్గదర్శి తరపు న్యాయవాది
  • మరి ఆ వివరాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏంటన్న కోర్టు
  • విచారణ జులైకి వాయిదా
Supreme Court asks Margadarsi to submit details of refund to depositors

‘మార్గదర్శి’లో పెట్టుబడి పెట్టిన వారికి చేసిన చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించి మార్గదర్శి రూ. 2,600 కోట్ల డిపాజిట్లు సేకరించిందని, దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జీబీ పార్దీవాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

చందాదారుల నుంచి సేకరించిన సొమ్మును మార్గదర్శి ఏ జాతీయ బ్యాంకులోనూ డిపాజిట్ చేయలేదని, ఇది చిట్‌ఫండ్ వ్యాపార చట్టం, రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని ఉండవల్లి వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం డిపాజిటర్ల నుంచి మార్గదర్శి ఎంత సేకరించింది? వారికి తిరిగి నగదు రూపంలో కానీ, చెక్‌ల రూపంలో కానీ ఎంత మొత్తం తిరిగి చెల్లించారో చెప్పాలని కోరింది. ఆ వివరాలను బయటపెట్టడంలో ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది.

స్పందించిన మార్గదర్శి తరపు న్యాయావాదులు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ లూథ్రాలు బదులిస్తూ.. ఆ వివరాలను గతంలోనే ఇచ్చామని, మళ్లీ కావాలన్నా ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కోర్టుకు తెలిపారు. 2007లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి పూర్తి చెల్లింపులు చేశామని, అంతేకాకుండా ఆ వివరాలను ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకుకు, ఏపీ ప్రభుత్వానికి అందిస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే, అందుకు సంబంధించిన ఆడిటర్ సర్టిఫైడ్ కాపీని, డేటాను కూడా కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు. చందాదారులు ఎవరికీ ఒక్క పైసా కూడా పెండింగ్ లేదని, ఆ వివరాలు మళ్లీ కావాలన్నా ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కోర్టుకు తెలిపారు. కాగా, చిట్‌ఫండ్ కేసులో సుప్రీంకోర్టు గతేడాది రామోజీరావు, ఆర్బీఐ, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

మార్గదర్శి సంస్థ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసును 2018లో ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం చెల్లింపులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ కేసు విచారణను జులైకి వాయిదా వేసింది.

More Telugu News