AP High Court: ఏపీలోని మూడు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

AP High Court Transfers ADJs And PDJs
  • కోడికత్తి కేసును విచారిస్తున్న విజయవాడ ఎంఎస్‌జే కోర్టు న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయ మూర్తి కడపకు బదిలీ
  • ఆయన స్థానంలో విజయవాడ మూడో ఏడీజే కోర్టు జడ్జి ఎ.సత్యానంద్ నియామకం
  • అందరూ మే ఒకటో తేదీలోపు చేరాలని ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులను (పీడీజే) నియమిస్తూ నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు జిల్లా జడ్జీలను (ఏడీజే) కొత్త స్థానాలకు బదిలీ చేసింది. జగన్ మోహన్‌‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడికి సంబంధించిన కేసును విచారిస్తున్న విజయవాడ ఎంఎస్‌జే కోర్టు/ రెండో ఏడీజే న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయమూర్తి కడపకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ మూడో ఏడీజే కోర్టు జడ్జి ఎ.సత్యానంద్‌ నియమితులయ్యారు.

హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)గా పనిచేస్తున్న గంధం సునీతను తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా హైకోర్టు నియమించింది. హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్)గా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్ ను విశాఖ పీడీజేగా బదిలీ అయ్యారు. విశాఖ పీడీజేగా పనిచేస్తున్న జి.గోపి నగరంలోని ఏపీ వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న జి.శ్రీదేవి అనంతపురం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. అనంతపురం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఇప్పటి వరకు ఉన్న తిరుమలరావును గుంటూరులోని ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా బదిలీ చేశారు.

అనంతపురం మొదటి ఏడీజే ఎస్.రమేశ్ చిత్తూరు మొదటి ఏడీజేగా, అనంతపురం ఆరో ఏడీజే జి.కబర్ధి నెల్లూరు మొదటి ఏడీజేగా, ఆ స్థానంలో ఉన్న సి.సత్యవాణి నెల్లూరు రెండో ఏడీజే/ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా, రాజమహేంద్రవరం మొదటి ఏడీజే కె.సునీత విజయవాడ కోఆపరేటివ్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు.  

వీరితోపాటు ప్రకాశం జిల్లా మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, ఏలూరు, కడప జిల్లా రాజంపేట, విశాఖ, విజయవాడ, చిత్తూరు జిల్లా మదనపల్లి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, గుడివాడ, విజయనగరం జిల్లాల ఏడీజేలను హైకోర్టు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా మే ఒకటో తేదీలోపు కొత్త స్థానాల్లో చేరాలని స్పష్టం చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
AP High Court
ADJ
PDJ
Vijayawada
Andhra Pradesh

More Telugu News