Hyderabad: డీఏవీ స్కూల్‌ ఘటన.. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

Convict sentenced to 20 years jail in Safilguda DAV School incident of 4 year old Girl
  • నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు
  • గతేడాది అక్టోబర్ లో స్కూలు ఆవరణలోనే దారుణం
  • తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన
బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చిన్నారిపై అఘాయిత్యం చేసిన డ్రైవర్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది అక్టోబర్ లో జరిగిన ఈ దారుణంపై విచారణ జరిపిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తుది తీర్పు వెలువరించింది. మంగళవారం ఈమేరకు దోషికి శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో నాలుగేళ్ల బాలికపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తెలిసిందే. 2022 అక్టోబర్ 17న ఈ దారుణం జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజని కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. విషయం తెలియడంతో స్కూలుకు చేరుకున్న పిల్లల తల్లిదండ్రులు రజనీ కుమార్ పై దాడి చేశారు. స్కూలు ఆవరణలోనే రజనీ కుమార్ ను చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయం చేయాలంటూ బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు రజనీ కుమార్ ను అరెస్టు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనలతో డీఏవీ స్కూలు గుర్తింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చదివేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూలు మారిస్తే పిల్లల చదువులు దెబ్బతింటాయని తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేయడంతో నవంబర్ లో డీఏవీ స్కూలు గుర్తింపును ప్రభుత్వం పునరుద్ధరించింది. స్కూలు మేనేజ్ మెంట్ కూడా కొత్తవారి చేతుల్లోకి వెళ్లింది.

చిన్నారిపై అఘాయిత్యానికి సంబంధించిన కేసును పోలీసులు వేగంగా దర్యాఫ్తు చేయడంతో కోర్టు విచారణ కూడా తొందరగానే పూర్తయింది. మంగళవారం ఉదయం ఈ కేసులో తుది తీర్పు వెలువరించిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. రజనీ కుమార్ ను దోషిగా తేల్చి, 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Hyderabad
Banjara Hills
DAV school
Driver
20 years jail

More Telugu News