Tollywood: దేశం కాని దేశంలో వారం పాటు వెంటిలేటర్ పై ఉన్నా.. బతుకుతానో లేదో అనుకున్నా: సురేందర్ రెడ్డి

  • అఖిల్ హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్
  • ఈ నెల 28న విడుదల కాబోతున్న చిత్రం
  • సినిమా ఆలస్యం కావడానికి కారణం వెల్లడించిన దర్శకుడు
surender reddy says he was on hospital bed for one week

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ఏజెంట్. ఆ యాక్షన్ స్పై మూవీ ఈనెల 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా, మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్ర పోషించారు. హిందీ నటుడు డినో మోరియా విలన్ గా కనిపించనున్నారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం మొదలలైన రెండు సంవత్సరాలకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడానికి గల కారణాలను దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించారు. తాను తీవ్ర ఆనారోగ్యానికి గురై, చావుబతుకులతో పోరాడానని చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

సినిమా షూటింగ్ కోసం తాను బుడాపెస్ట్ వెళ్లగానే తాను కరోనా బారిన పడ్డానని తెలిపారు. తీవ్రంగా ప్రభావితమై వారం రోజులపాటు వెంటిలేటర్ మీద ఉన్నానని, బతుకుతానో లేదోనన్న పరిస్థితి ఎదుర్కొన్నానని తెలిపారు. తమ సినిమా యూనిట్ వాళ్లంతా తిరిగి స్వదేశానికి వచ్చేయగా.. తన కుటుంబ సభ్యులు హోటల్ లో ఉండిపోయారని చెప్పారు. అటువంటి పరిస్థితిలో తాను ఆసుపత్రిలో చేరగా.. తన పక్కన రోజుకి ముగ్గురు, నలుగురు చనిపోతూ ఉండేవారని తెలిపారు. ‘అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక వారం హాస్పిటల్ లో ఉన్నాక, మళ్ళీ హోటల్ లో అదే చికిత్స కొనసాగించా. నాకు, నా కుటుంబానికి ఎదురైన ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నేను కోలుకోవడానికి సరిగ్గా ఆరు నెలలు పట్టింది. ఇండియా వచ్చి ఇక్కడ మళ్ళీ మెడికేషన్ మొదలు పెట్టిన తరువాత మెల్లగా కోలుకున్నాను. అందుకని ఈ సినిమా ఆలస్యం అయింది’ అని చెప్పుకొచ్చారు. 

అయినా తనపై నమ్మకంతో ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన అఖిల్ ని ప్రశంసించాలన్నారు. హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో హీరో అఖిల్ ను కాపాడబోయి సురేందర్ రెడ్డి కాలికి గాయమైంది. దాని వల్ల కూడా సినిమా మరికొంత ఆలస్యం అయింది. సినిమాకు రెండేళ్లు పట్టినా 102 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని సురేందర్ రెడ్డి చెప్పారు.

More Telugu News