Delhi Liquor Scam: ఢిల్లీలో ఆప్ నేతల అత్యవసర సమావేశం

Aap leaders holds emergency meeting amid Cbi questioning kejriwal
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ
  • ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్టు చేయచ్చన్న ఆందోళనతో నేతలు
  • తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు అత్యవసర సమావేశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ సారథ్యంలో పలువురు నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆప్ నేషనల్ సెక్రెటరీ పంకజ్ గుప్తా, ఢిల్లీ మేయర్ షెల్బీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ ఆలేయ్ అహ్మద్ ఇక్బాల్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే.. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేస్తోందేమోన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు.. సీబీఐ కేజ్రీవాల్‌ను ప్రశ్నించడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగిన ఆప్ నేతలు రాఘవ్ ఛద్దా, సంజయ్ సింగ్, జాస్మిస్ షా, ఇతర పార్టీ సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిపూర్వకంగా నిరసనలు తెలుపుతున్న వారిని ఎందుకు అరెస్టు చేశారంటూ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోదీ ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ తదుపరి కార్యాచరణపై నిర్ణయించేందుకు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

కాగా..ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ కార్యాలయం వద్ద వెయ్యి మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా సెక్షన్ 144 కూడా విధించారు.

  • Loading...

More Telugu News