Avinash Reddy: వివేకా హత్య విషయం ముందుగా తెలిసిన ఆయన అల్లుడ్ని విచారించడంలేదు: ఎంపీ అవినాశ్

  • వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్
  • తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి
  • తనకంటే వివేకా అల్లుడికి గంట ముందే హత్య విషయం తెలుసని వెల్లడి
  • లేఖ, ఫోన్ దాచింది వివేకా అల్లుడేనని ఆరోపణ
  • సీబీఐ అధికారులు కీలక అంశాలను పట్టించుకోవడంలేదని అసహనం 
Avinash Reddy comments on CBI probe in Viveka murder case

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో పరిణామాలు చకచకా మారుతున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సీబీఐ పలువురిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ ఉదయం వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి, హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలో, భాస్కర్ రెడ్డి తనయుడు, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వివేకా హత్య కేసు గురించి ముందుగా తెలిసింది ఆయన అల్లుడికేనని స్పష్టం చేశారు. పోలీసులకు తానే సమాచారం అందించానని, తన కంటే గంట ముందే తెలిసినా వివేకా అల్లుడు పోలీసులకు చెప్పలేదని స్పష్టం చేశారు. హత్య సమాచారం దాచిన వివేకా అల్లుడ్ని మాత్రం సీబీఐ విచారించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. వివేకా లేఖను, ఫోన్ ను దాచిపెట్టాలని చెప్పింది ఆయన అల్లుడేనని ఆరోపించారు. ఈ కేసులో తమను దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దస్తగిరి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ పట్టించుకోవడంలేదని, వాచ్ మన్ రంగన్న చెప్పింది కూడా పట్టించుకోవడంలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారని, ఏ-4 నిందితుడైన అతడిని అప్రూవర్ గా మార్చుకున్నారని అవినాశ్ రెడ్డి వెల్లడించారు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ఒకే కోణంలో, ఒకే లక్ష్యంతో తీసుకెళుతున్నారని తెలిపారు. 

విచారణలో కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోందని, అర్థంపర్థంలేని విషయాలను పెద్దగా చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి తాము లేవనెత్తిన అంశాలపై సీబీఐ స్పందించడంలేదని ఆరోపించారు. వివేకా స్వయంగా రాసిన లేఖను కూడా సీబీఐ పట్టించుకోవడంలేదని అవినాశ్ రెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం అని పేర్కొన్నారు. 

వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని, వ్యక్తుల లక్ష్యంగా కాదని అవినాశ్ రెడ్డి హితవు పలికారు. అధికారుల తీరుపై సీబీఐ ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. పాత అధికారుల తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. 

ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమని, తాము నిర్దోషులుగా బయటపడతామని, తమ మంచితనం నిరూపితమవుతుందని అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో సత్యం గెలవాలి... న్యాయం గెలవాలి అని వ్యాఖ్యానించారు.

More Telugu News