Sudan: ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ సుడాన్‌లోని భారతీయులకు హెచ్చరిక

Indian embassy urges indians in sudan to stay indoors amid clashes between military and paramilitary forces
  • సుడాన్ సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు
  • సైన్యంలో పారామిలిటరీ దళాల విలీనం విషయంలో కుదరని ఏకాభిప్రాయం
  • సుడాన్ రాజధాని సహా పలు ప్రాంతాల్లో పరస్పరం కాల్పులు, బాంబు దాడులు
  • సుడాన్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

సుడాన్‌‌లో మిలిటరీ, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. రాజధానితో పాటూ ఇతర ప్రాంతాల్లోని భారతీయులెవరూ తమ ఇళ్లల్లోంచి బయటకు రావద్దని హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కీలక సూచన చేసింది. 

కొంత కాలంగా సుడాన్‌ సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైన్యానికి అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ నేతృత్వం వహిస్తుండగా పారామిలిటరీ దళానికి మొహమ్మద్ హందాన్ డ్యాగ్లో నాయకుడిగా ఉన్నారు. 2019లో అప్పటి ప్రభుత్వంపై తిరుగుబాటుతో సుడాన్‌లో సైనిక పాలన మొదలైంది. ఈ క్రమంలో దేశంలో పౌరపాలన పునరుద్ధరించేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది. అయితే.. సైన్యానికి ఇంతకాలం తోడుగా ఉన్న పారామిలిటరీ దళాలను సైన్యంలో విలీనం చేసుకునే విషయంలో మిలిటరీ కమాండర్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మధ్య తీవ్రస్థాయిలో బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. ఇటీవల వారి మధ్య జరిగిన చర్చలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య దేశరాజధానితో పాటూ పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. 

ఇరు వర్గాల పరస్పర కాల్పులు, బాంబు దాడులతో శనివారం సుడాన్ రాజధాని ఖార్తూమ్ దద్దరిల్లింది. ఈ ఘర్షణలకు అవతలివారే కారణమంటూ ఇరు వర్గాలూ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాలు నగరంలోని ప్రధాన ఎయిర్‌పోర్టును తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో విమాన సర్వీసులన్నీ రద్దయిపోయాయి. మరోవైపు, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాలను సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది. దేశాన్ని కాపాడుకునేందుకు తాము చేయగలిగిందంతా చేస్తున్నట్టు సైనిక దళాల ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News