Delhi Capitals: ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... తొలి మ్యాచ్ లో బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ

  • నేడు ఐపీఎల్ లో డబుల్ హెడర్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ ఢిల్లీ పరాజయం
Delhi Capitals takes on RCB

ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. దాదాపు ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతూ, చివరి ఓవర్ వరకు ఉత్కంఠతను కలిగిస్తోంది. ఇవాళ శనివారం కావడంతో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. 

3 మ్యాచ్ లు ఆడి 1 విజయంతో ఉన్న బెంగళూరు మరో విజయంపై కన్నేయగా... నాలుగు మ్యాచ్ లు ఆడి నాలుగింట్లోనూ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి గెలుపు కోసం ఎదురుచూస్తోంది. ఇవాళ్టి మ్యాచ్ కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ టోర్నీలో కనీసం ఒక్క విజయం కూడా సాధించని జట్టేదైనా ఉందంటే అది ఢిల్లీ జట్టే. జట్టులో స్టార్లకు కొదవ లేకపోయినా, విజయం మాత్రం అందకుండా వేధిస్తోంది. 

తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ జట్టు, రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 6 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్... 57 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేయగా... నాలుగో మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడింది. ఇవాళ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లోనైనా ఢిల్లీ తలరాత మారుతుందేమో చూడాలి. 

కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, పృథ్వీ షా, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నోర్కియా, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజూర్ రెహ్మాన్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఢిల్లీ దారుణమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

More Telugu News