BJP: ఎన్నికల ముందు కర్ణాటక బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం

  • మే 10న కర్ణాటక ఎన్నికలు
  • బుధవారం 189 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
  • టికెట్ లభించకపోవడంతో సవది అసంతృప్తి
  • తాను చనిపోయాక బీజేపీ కార్యాలయం ముందు నుంచి
    మృతదేహాన్ని తీసుకెళ్లొద్దన్న సవది
 Shock To BJP In Karnataka Laxman Savadi joins Congress

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవది బీజేపీకి టాటా చెప్పేసి కాంగ్రెస్‌లో చేరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి తాను చాలా చేశానని, తాను చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని బీజేపీ కార్యాలయం ముందు నుంచి తీసుకెళ్లొద్దని కోరారు.

కౌన్సిల్ సభ్యత్వానికి కూడా..
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం బీజేపీ 189 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో లక్ష్మణ్ సవది పేరు లేకపోవడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది. అథాని నియోజకవర్గ టికెట్ ఆశించిన ఆయన పార్టీ తీరుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సభ్యత్వంతోపాటు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

కాంగ్రెస్ కోసం చేతనైనంత చేస్తా
రాజకీయపరమైన విభేదాలున్నప్పటికీ తాను కాంగ్రెస్ నేతలను కలిసినప్పుడు వారు సాదరంగా ఆహ్వానించారని, అందుకు తాను కృతజ్ఞుడినని సవది పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేతలను కోరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. తనపై నమ్మకముంచిన పార్టీ మేలు కోసం తన చేతనైనంత కృషి చేస్తానని సవది పేర్కొన్నారు.  

రాజకీయాల్లో ఇవన్నీ కామనే
సవది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. సవది నిర్ణయం బాధించిందన్నారు. అయితే, రాజకీయాల్లో ఇది సర్వ సాధారణ విషయమేనని తేలిగ్గా తీసుకున్నారు. అక్కడాయనకు రాజకీయ భవితవ్యం కనిపించిందని, అందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. అయితే, 60 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అసలు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. అందుకనే వారు ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్నారని, అయినా ఫలితం ఉండబోదని బొమ్మై తేల్చి చెప్పారు.

More Telugu News