MS Dhoni: ఆఖరి బంతికి సిక్స్ కొట్టలేకపోయిన ధోనీ... రాజస్థాన్ రాయల్స్ దే గెలుపు

Dhoni fails to hit a six as Rajasthan Royal beat CSK
  • చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి 200వ మ్యాచ్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైన సూపర్ కింగ్స్
  • చెన్నై కెప్టెన్ గా 200వ మ్యాచ్ లో ధోనీ పోరాటం వృథా
మహేంద్ర సింగ్ ధోనీ చిరస్మరణీయంగా మలుచుకోవాలనుకున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నే విజయం వరించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ... ఈ మ్యాచ్ లో తన జట్టును గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు అవసరం కాగా.... ధోనీ రెండు సిక్స్ లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కానీ, చివరి బంతికి 5 పరుగులు చేస్తే చెన్నై గెలుస్తుందనగా, సందీప్ శర్మ యార్కర్ వేయడంతో ధోనీ సింగిల్ తో సరిపెట్టుకున్నాడు. 

ధోనీ 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో రవీంద్ర జడేజా 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 25 పరుగులు చేశాడు. 

అంతకుముందు... మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో చెన్నై జట్టు ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (10) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ డెవాన్ కాన్వే (50), అజింక్యా రహానే (31) జోడీ రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు దిశగా సాగుతున్నట్టు అనిపించింది. 

అయితే రవిచంద్రన్ అశ్విన్ కీలక సమయాల్లో వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ ను రేసులోకి తీసుకువచ్చాడు. అశ్విన్... రహానే, శివమ్ దూబే (8) వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్ లో చహల్ కూడా రెండు వికెట్లతో చెన్నైని దెబ్బకొట్టాడు. కాన్వే, అంబటి రాయుడు (1)లను అవుట్ చేసి రాజస్థాన్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. 

ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన జడేజా, ధోనీ భారీ షాట్లతో మ్యాచ్ ను చివరి బంతి వరకు తీసుకెళ్లినా.... ఆఖరి బంతికి సిక్స్ కొట్టడంలో ధోనీ విఫలం కావడంతో మ్యాచ్ చెన్నై చేజారింది.
MS Dhoni
CSK
Rajasthan Royals
IPL

More Telugu News