Nara Lokesh: ​​పేరుకే పెద్దారెడ్డి.. చేసేవన్నీ...!: నారా లోకేశ్

  • తాడిపత్రి నియోజకవర్గంలో యువగళం
  • లోకేశ్ పాదయాత్రకు భారీగా తరలి వచ్చిన జనం
  • స్థానిక ఎమ్మెల్యే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు
  • సీఎం జగన్ ను కూడా తూర్పారబట్టిన టీడీపీ అగ్రనేత
Lokesh slams MLA Peddareddy

తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో వరుసగా రెండోరోజు కూడా యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 68వ రోజు బుధవారం పసలూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మండుటెండలో సైతం జనం లోకేశ్ ను కలిసేందుకు పోటీపడ్డారు. సాయంత్రం భోజన విరామానంతరం రాయల చెరువు చేరుకున్న లోకేశ్ కు వేలాదిమంది ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. 

ఈ ఉదయం కమ్మవారిపల్లిలో నిరుద్యోగ యువత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 23 రోజులపాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హోరెత్తించిన యువగళం పాదయాత్ర రేపు (గురువారం) ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 23 రోజుల పాటు 300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కొనసాగింది. రాయలచెరువులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ప్రసంగించారు.

లోకేశ్ మాటల తూటాలు...

  • జనం నువ్వే మా దరిద్రం అంటున్నారు జగన్!
  • ముఖ్యమంత్రి జగన్ మొన్నటి వరకూ సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు... ఇప్పుడు సంచి పట్టుకొని స్టిక్కర్లు అతికించుకుంటున్నాడు
  •  నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్ అతికిస్తే సొంత తల్లి, చెల్లి నమ్మని వాడిని మేము ఎలా నమ్మాలి అని జనం నిలదీస్తున్నారు. 
  • పాదయాత్ర 68 రోజులకే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక 400 రోజులు పూర్తయ్యే సరికి జగన్ పర్మినెంట్ గా లండన్ కి పారిపోవడం ఖాయం.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంబేద్కర్ రాజ్యాంగం దెబ్బకి తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం వచ్చింది.

మహాత్మాగాంధీ పర్యటించిన నేల తాడిపత్రి

చింతల రమణ స్వామి దేవాలయం, బుగ్గ రామలింగేశ్వర స్వామి కొలువైన ప్రాంతం తాడిపత్రి అని లోకేశ్ వెల్లడించారు. మహాత్మా గాంధీ పర్యటించిన పవిత్ర నేల తాడిపత్రి అని కీర్తించారు. దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన తాడిపత్రి, మున్సిపాలిటీ కలిగిన నియోజకవర్గం అని వివరించారు. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు పిడికిలి బిగించింది తాడిపత్రి అని లోకేశ్ తెలిపారు. ఇంత గొప్ప నేలపై పాదయాత్ర చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

తాడేపల్లిలో పెద్దపిల్లి – తాడిపత్రిలో చిన్నపిల్లి

తాడేపల్లి ప్యాలస్ లో పెద్ద పిల్లి ఉంది... తాడిపత్రి లో చిన్న పిల్లి ఉంది అని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. "పేరుకే పెద్దారెడ్డి చేసేవి అన్ని చిల్లర పనులే. తాడేపల్లి ప్యాలస్ పిల్లి పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళుతుంది. తాడిపత్రి పిల్లి మాత్రం ప్రభాకర్ గారి ఇంట్లో ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాకా వెళ్లి బిల్డప్ ఇస్తుంది. పిల్లి సరదాగా సింహాసనం మీద కూర్చున్నంత మాత్రానా సింహం అవుతుందా? తాడిపత్రి పిల్లిని చూస్తే జాలి వేస్తుంది" అని వ్యాఖ్యలు చేశారు.

అవినీతి అనకొండ పెద్దారెడ్డి

తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసే అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని నియోజకవర్గంలోని కొండలు, గుట్టలు, నదులు, గనులు అన్నిటిని మింగేస్తున్న అతి పెద్ద అవినీతి అనకొండ ఈయన అని విమర్శించారు. "ఎమ్మెల్యే కాకముందు చిన్న వాహనం ఉండేది. ఇప్పుడు పదుల కొద్దీ లగ్జరీ కార్లు ఎలా వచ్చాయి. ఈయన అవినీతిలో అంచెలంచెలుగా ఎదిగాడు. మొదట్లో పెన్నా నది నుంచి ఇసుక తోలే ఎద్దుల బండి యజమానుల నుంచి రూ.10 వేలు వసూలు చేసేవాడు. తర్వాత కొద్దికొద్దిగా నదిని ఆక్రమించేశాడు. 

ఎవరైనా ఇంటికి గేటు పెట్టుకుంటారు, పొలాలకు కంచెలు వేసుకుంటారు. కానీ ఈ పెద్దారెడ్డి స్టైల్ వేరు... ఏకంగా పెన్నా నదికే గేట్లు పెట్టేసాడు. తన అనుచరులకు నదిని వాటాలు వేసి పంచేశాడు. రోజుకు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నాడు. మైన్స్ అధికారులు వచ్చి అడ్డుకున్నా ఇసుక తవ్వకాలు ఆపలేదు. పర్మిషన్ చూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేసారు. ఆ తరువాత అనుమతులు ఇచ్చారు. అనుమతి ఇచ్చింది గోరంత. తవ్వుతుంది కొండంత. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక దందా చూసిన తర్వాత... ఆయన అన్నం తిని బతుకుతున్నాడా ఇసుక తిని బతుకుతున్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇసుకతోపాటు ఈ పెద్దారెడ్డి కొండలు గుట్టలను కూడా వదలడం లేదు. ఎర్రగా ఉన్న గుట్ట కనిపిస్తే చాలు తవ్వేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్ రూ.2000 చొప్పున తాడిపత్రిలోనే విక్రయిస్తున్నారు. పెదపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో ఓ విశ్రాంత అధికారి తనకున్న భూమిలో కొంత ఆలయానికి ఇచ్చాడు. మిగిలిన భూమిలో ఇల్లు కట్టుకొని జీవనం సాగించాలని ఆశించారు. అయితే ఈ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు ఆ భూమిని కబ్జా చేశారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. దీంతో ఆ వృద్ధ దంపతులు వారి స్థలంలో నిరసనకు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది. 

జగన్ రెడ్ల పరువు తీశారు!

నాలుగేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రెడ్లపరువు తీశారని లోకేశ్ తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతపురంజిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, తూట్రపల్లి గ్రామంలో రెడ్డి సామాజికవర్గంతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... రాజశేఖర రెడ్డి రాజకీయ చరిత్రలో ఏనాడూ రెడ్ల పరువును దిగజార్చలేదని తెలిపారు. "ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్ల పరువు తీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక యువత భవిష్యత్తు సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, యువత భవిష్యత్తును 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. రెడ్డి సామాజికవర్గం కూడా జగన్ చేతిలో బాధితులుగా మారారు. 2014-19 మధ్య జరిగిన పాలనలో ఏనాడూ అక్రమ కేసులు పెట్టలేదు. జగన్ చేతిలో తాడిపత్రిలోని రెడ్లు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు మొత్తం బాధితులే. 

సీనియర్ నాయకులు జనార్థన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి లపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టారు. బంగారుపాళ్యంలో డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేయి పట్టుకుని దురుసుగా ప్రవర్తించడం చూసి నాకు చాలా కోపం వచ్చింది. వైసీపీ పాలనలో పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడవు. ఎందుకంటే అవన్నీ అక్రమ కేసులే. 50 ఏళ్లు గౌరవప్రదంగా జీవించిన రెడ్లను జగన్మోహన్ రెడ్డి నేడు దేశంలో దోపిడీదారుల జాబితాలో చేర్చాడు" అని అన్నారు. 

రెడ్డి సామాజికవర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రెడ్డి నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. వారితో మాట్లాడడం లేదని వివరించారు. "జగన్ సమీప బంధువు వెంకటేశ్వరరెడ్డి తనను పట్టించుకోలేదని జగన్ ను వదిలి వెళ్లిపోయాడు. ఈబీసీ పథకాన్ని కేంద్రం రెండేళ్ల కిందటే అమలు చేయాలని చెబితే, రెండేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. రెడ్డి కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలకు లొంగిపోయి రెడ్డి సామాజికవర్గం పూర్తిగా నష్టపోయింది. రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉండాలో నిర్ణయించుకోవాలని కోరుతున్నా" అని పిలుపునిచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 874.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.*

*69వరోజు (13-4-2023) యువగళం వివరాలు:*

*డోన్ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాలజిల్లా)*

ఉదయం

7.00 – రాయలచెరువు (తాడిపత్రి నియోజకవర్గం) క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.45 – చందన గ్రామంలో స్థానికులతో మాటామంతీ.

9.50 – దాయలమడుగులో మహిళలతో మాటామంతీ.

*10.00 – నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రవేశం.*

10.10 – డి.రంగాపురంలో స్థానికులతో మాటామంతీ.

11.20 – నల్లమేకలపల్లి గ్రామస్తులతో సమావేశం.

11.50 – రాంపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.05 – జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1.05 – జక్కసానికుంట్లలో భోజన విరామం.

సాయంత్రం

3.00 – జక్కసానికుంట్లలో యువతతో ముఖాముఖి.

4.00 – జక్కసానికుంట్ల నుంచి పాదయాత్ర ప్రారంభం.

5.00 – పిఆర్ పల్లి గ్రామస్తులతో మాటామంతీ.

6.40 – గుడిపాడులో విడిది కేంద్రంలో బస.


More Telugu News