Pakistan: భారత్ లో జరిగే ప్రపంచ కప్​లో పాకిస్థాన్​ మ్యాచ్ లు ఆ రెండు వేదికల్లోనే!

Pakistan Prefer Two Potential Safe Venues To Play All Their 2023 World Cup Games
  • అక్టోబర్–నవంబర్ లో భారత్ లో వన్డే ప్రపంచ కప్
  • మొత్తం 12 నగరాల్లో 46 మ్యాచ్ లు
  • భారత్, పాక్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చే నగరంపై ఉత్కంఠ
భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ జట్టు తమ మెజారిటీ మ్యాచ్‌లను చెన్నై, కోల్‌కతాలో ఆడేందుకు సుముఖంగా ఉంది. ఇది వరకు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ రెండు వేదికల్లో ఆడిన పాక్ వాటిని సురక్షితంగా భావిస్తోందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ కప్‌ అక్టోబర్‌ 5న మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 46 మ్యాచ్‌లు 12 నగరాల్లో జరగనున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజ్‌కోట్, గౌహతి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ఇండోర్ లను వేదికలుగా ఖరారు చేసింది. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు 9 మ్యాచ్ లు ఆడనుంది.

తొలుత ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు రాకపోతే తాము వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గతంలో హెచ్చరించింది. అయితే, ఐసీసీ జోక్యంతో ఈ విషయంలో పీసీబీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ జట్టుకు కేటాయించే వేదికల విషయంలో ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ స్థాయి వ్యక్తి పీసీబీతో చర్చలు జరుపుతున్నారు. చెన్నై, కోల్ కతాలో ఆడేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక, మెగా టోర్నీలో ఇండియా, పాక్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 1.32 లక్షల సీటింగ్‌ సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే ఐసీసీకి మంచి లాభాలు రానున్నాయి. కానీ, ఆ స్టేడియంలో ఫైనల్‌ జరగనుంది. కాబట్టి భారత్, పాక్ మ్యాచ్ కోసం వేరే వేదికను ఎంచుకోవాల్సి ఉంది. ఏ నగరానికి అవకాశం దక్కుతుందో చూడాలి.
Pakistan

More Telugu News