కోహ్లీని విమర్శించిన వ్యాఖ్యాతపై పాక్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
- లక్నోతో మ్యాచ్ లో 42 నంచి 50 పరుగులు అందుకునేందుకు 10 బంతులు తీసుకున్న విరాట్
- వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఇలా నిదానంగా బ్యాటింగ్ చేశాడన్న వ్యాఖ్యాత సైమన్ డౌల్
- ఇదంతా చెత్త వాగుడు అంటూ డౌల్ పై సల్మాన్ భట్ విమర్శలు
‘డౌల్ పాకిస్థాన్ మ్యాచ్ లకు కామెంటరీ చేస్తున్నప్పుడు కూడా బాబర్ ఆజమ్ విషయంలో ఇలాంటి పదాలు ఉపయోగించాడు. అతను మనస్సాక్షిగా ఆటను వీక్షించి ఉంటే కోహ్లీ.. స్పిన్నర్ బిష్ణోయ్ బౌలింగ్ లో మూడు నాలుగు సార్లు షాట్లు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, షాట్లు కనెక్ట్ కాలేదు. ఇది ఆటలో ఓ భాగం. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు సాధించాడు. తను ఇంకా ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. డౌల్ చెత్త వాగుడు వాగాడు’ అంటూ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
75 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన కోహ్లీ లాంటి ఆటగాడు మైలురాళ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డౌల్‌కు బట్ సూచించాడు. ‘అతను ప్రపంచ స్థాయి ఆటగాడు. మీరు ఇలాంటి సంకుచిత ఆలోచన నుంచి బయటపడండి. బాబర్, విరాట్, విలియమ్సన్ వంటి పెద్ద ఆటగాళ్లందరూ పవర్ హిట్టర్లు కాదు. వారు తమ వికెట్‌కు విలువనిస్తారు. బహుశా ఇలాంటి వ్యాఖ్యలతో డౌల్ వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు’ అని భట్ చెప్పుకొచ్చాడు.