Lucky Ali: బ్రాహ్మణ్ అనే పదం ఇబ్రహీం నుంచి వచ్చిందన్న సింగర్ లక్కీ అలీ.. తర్వాత క్షమాపణలు

  • లక్కీ అలీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన నెటిజన్లు
  • వెనక్కి తగ్గి పోస్టును డిలీట్ చేసి క్షమాపణలు వేడుకున్న సింగర్
  • తాను అనుకున్నట్టుగా రాయలేకపోయానన్న లక్కీ అలీ
  • అందిరినీ ఒక తాటిపైకి తీసుకురావాలన్నదే తన ఉద్దేశమన్న గాయకుడు
Singer Lucky Ali Apologises To Hindu Brothers  Over Controversial Post

బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ బ్రాహ్మణులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బ్రాహ్మణ్’ అనే పదం ‘అబ్రామ్’ అనే పదం నుంచి వచ్చిందని,  దాని మూలం ‘ఇబ్రహీం’ అంటూ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ పోస్టు వైరల్ కావడంతో లక్కీ అలీపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ఆయన ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేసి క్షమాపణలు వేడుకున్నారు.

   లక్కీ అలీ ఫేస్‌బుక్‌లో పోస్టు పెడుతూ.. ‘బ్రాహ్మణ్’ అనేది ‘బ్రహ్మ’ నుంచి వచ్చిందని, అది ‘అబ్రామ్’ నుంచి వచ్చిందని పేర్కొన్నారు. ‘అబ్రామ్’ అనేది ‘అబ్రహాం’ లేదంటే ‘ఇబ్రహీం’ నుంచి వచ్చిందన్నారు. కాబట్టి బ్రాహ్మణులు ఇబ్రహీం వంశమని వివరించారు. అన్ని దేశాలకు అలైహిసలాం తండ్రి అని పేర్కొన్నారు. ఎవరూ తమలో తాము తర్కించుకోకుండా ఎందుకు వాదించుకుంటున్నారని, ఎందుకు పోట్లాడుకుంటున్నారని ఆ పోస్టులో ప్రశ్నించారు.

ఆ పోస్టుపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన 64 ఏళ్ల లక్కీ అలీ క్షమాపణలు చెబుతూ.. బాధించడం, కోపాన్ని తెప్పించడం తన ఉద్దేశం కాదని, అందరినీ ఒక చోటుకు చేర్చాలన్నదే తన అభిమతమని అన్నారు. అయితే, తాను అనుకున్నట్టుగా రాయలేకపోయానని పేర్కొన్నారు. తన పోస్టుతో హిందూ సోదరులు, అక్కచెల్లెళ్లను బాధించానని, అందుకు తీవ్రంగా చింతిస్తున్నానని లక్కీ అలీ పేర్కొన్నారు.

More Telugu News