Sajjala Ramakrishna Reddy: ఏం పోరాటం చేయాలి?: స్టీల్ ప్లాంట్ అంశంలో సజ్జల వ్యాఖ్యలు

  • స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ సర్కారు పాల్గొంటోందని ప్రచారం
  • విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అన్న సజ్జల
  • అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శలు
  • స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని వెల్లడి
  • ప్రధానితో కూడా మాట్లాడారని వివరణ
Sajjala press meet

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో విపక్షాలు ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. జగనే మళ్లీ రావాలి, తమకు జగనే కావాలని ప్రజలు కోరుకుంటుండడంతో విపక్షాలు భరించలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతోందా? మా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ వయబిలిటీ గురించే ఆలోచిస్తోంది అని సజ్జల పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ టెండర్ లో చాలా పరిమితులు ఉన్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని, ప్రధాని మోదీతోనూ చాలాసార్లు మాట్లాడారని సజ్జల వివరించారు. జగన్ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్ కూడా చెప్పారని వెల్లడించారు. పక్క రాష్ట్రాల్లో జరిగే పరిణామాలను కూడా తీసుకువచ్చి జగన్ ను నిలదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణ ప్రయోజనం లేదా స్వార్థ ప్రయోజనం కోసం చంద్రబాబు, ఆయన పార్టీ, ఆయనకు మద్దతు ఇస్తున్నవారు కానీ ఆడుతున్న నాటకాలను గుర్తించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు సజ్జల పేర్కొన్నారు. 

ఏ ప్రయత్నం చేసినా కేంద్రాన్ని ఒప్పించి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోరాడితే పోయేదేం లేదనడానికి ఇదేమీ యూనియన్ కాదని, రాజకీయ పార్టీ అని వ్యాఖ్యానించారు. సమర్థంగా వాదించి కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్లు కూడా ఈ దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో టీడీపీ కూడా కేంద్రాన్ని అడిగితే మంచిదే... బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో అడిగితే బాగుంటుంది... స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని ఎంతమంది అడిగితే అంత మంచిది అని సజ్జల వివరించారు. 

ఇక స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశంపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏమని ప్రతిపాదన చేసిందో తనకు తెలియదని, వర్కింగ్ క్యాపిటల్ అంశంలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చని అన్నారు. వాళ్లు స్టీల్ బిజినెస్ లో లేరని, ఒకవేళ కొత్తగా స్టీల్ బిజినెస్ స్థాపించి ఇక్కడ్నించి తీసుకెళ్లి మార్కెటింగ్ చేస్తారేమో అని సజ్జల అభిప్రాయపడ్డారు. సింగరేణి సంస్థ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటారేమో తనకు తెలియదని అన్నారు. వాళ్లకు సంబంధించిన విషయాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం, బాధ్యత తమకేమీ లేవని స్పష్టం చేశారు. 

ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ శక్తులు పనిచేస్తున్నాయో, చంద్రబాబు ఎంత ప్రమాదకరం అనే విషయాలను అందరికీ తెలిసేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు పోరాడాలని తమను నిందిస్తున్నారని, నాడు ప్రైవేటీకరణకు సానుకూలంగా మాట్లాడింది ఈయన కాదా అని మండిపడ్డారు. ఏం పోరాటాలు చేశారు... ఏం ఆపారు? అని నిలదీశారు. 

అయినా ఇప్పుడు పోరాటాల రూపాలు మారాయని, ఏది చేసినా సమతుల్యతతో చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్ మిగతావారికి మార్గదర్శకులుగా నిలిచారని, అందుకే చరిత్రలో కూడా నిలిచిపోతారని, ఇది రియాలిటీ అని సజ్జల ఉద్ఘాటించారు. రియాలిటీని కాదని నేల విడిచి సాము చేసుకుంటామనే వారు అలాగే చేసుకోవచ్చని హితవు పలికారు. 

ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయనేది విశ్లేషించాల్సింది మీడియానే అని, తమది రాజకీయ పార్టీ అని వివరించారు. మీడియా చెబితే తాము కూడా అర్థం చేసుకుంటామని అన్నారు.

More Telugu News