Madhya Pradesh: భారత ప్రధాన న్యాయమూర్తిని కావాలని ఉందన్న బాలికతో మోదీ ఏమన్నారంటే..!

  • పదమూడేళ్లకే పన్నెండో తరగతి పూర్తిచేసిన మధ్యప్రదేశ్ బాలిక తనిష్క సుజిత్
  • ప్రస్తుతం బీఏ సైకాలజీ చదువుతున్న తనిష్క
  • అమెరికా వెళ్లి లా పూర్తిచేయాలని భావిస్తున్నట్లు వెల్లడి
  • ఇటీవల ఇండోర్ లో పర్యటించిన మోదీని కలుసుకున్న బాలిక
Teen Told PM She Aimed To Become Chief Justice of India

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన తనిష్క సుజిత్ బాల మేధావి.. పదమూడేళ్ల వయసులోనే పన్నెండో తరగతి పూర్తిచేసింది. ప్రస్తుతం తన వయసు పదిహేనేళ్లు. ఇండోర్ లోని దేవీ అహల్య యూనివర్సిటీలో బీఏ సైకాలజీ చదువుతోంది. ఇటీవల భోపాల్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీని తనిష్క కలుసుకుంది. ఈ సందర్భంగా మోదీతో మాట్లాడుతూ.. భారత దేశ ప్రధాన న్యాయమూర్తి కావాలన్నదే తన లక్ష్యమని వెల్లడించింది. తన లక్ష్యం గురించి చెప్పడంతో ప్రధాని విలువైన సూచనలు చేశారని తనిష్క మీడియాకు వెల్లడించింది. 

ప్రధానిని కలుసుకోవాలన్న తన కలను భోపాల్ లో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ నెరవేర్చిందని తనిష్క వెల్లడించింది. ఈ మీటింగ్ లో ప్రధాని తన భవిష్యత్ ప్రణాళికల గురించి, తన లక్ష్యం గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పింది. బీఏ పూర్తిచేశాక అమెరికా వెళ్లి లా చదవాలని అనుకుంటున్నానని, ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టాలన్నదే తన కల అని ప్రధానితో చెప్పానని వెల్లడించింది. తన కల నెరవేరాలని ప్రధాని ఆశీర్వదించారని, సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయవాదులు ఎలా వాదిస్తున్నారో వినాలని సూచించారని తనిష్క చెప్పింది. తన లక్ష్య సాధనకు ఇది మోటివేషన్ గా ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారని పేర్కొంది.

More Telugu News