Gudivada Amarnath: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయాలని భావిస్తుండటంపై ఏపీ మంత్రి అమర్ నాథ్ స్పందన

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయబోతున్న కేంద్ర ప్రభుత్వం
  • బిడ్ వేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం
  • రాజకీయాల కోసం వాళ్లు ఏవో మాట్లాడతారన్న అమర్ నాథ్
AP miniter Gudivada Amarnath response on Telangana bid for Vizag Steel Plant

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బిడ్డింగ్ ప్రక్రియను అధ్యయనం చేయాలంటూ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదనేదే తమ ప్రభుత్వ స్పందన అని అన్నారు. తమ స్టాండ్ అది అయినప్పుడు, ప్లాంట్ ను తాము ఎలా కొంటామని ప్రశ్నించారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం కరెక్ట్ కాదని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడు తాము కూడా బిడ్ వేస్తామని వారు చెప్పడం ఎంత వరకు సమంజసమని అడిగారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మేయమనేదే వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. అయితే ఈ అంశం గురించి కేసీఆర్ నుంచి కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వినలేదని చెప్పారు. అధికారికంగా వాళ్ల స్టాండ్ ఏమిటో తెలియకుండా తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. రాజకీయాల కోసం వాళ్లు ఏవో మాట్లాడతారని, వాటికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని అన్నారు.

More Telugu News