ponguleti: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ఎమ్మెల్యేగా గెలవనివ్వను: పొంగులేటి సవాల్

  • టీఆర్ఎస్ లోకి రావాలని తనపై ఎంతో ఒత్తిడి చేశారన్న పొంగులేటి
  • టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసం టీఆర్ఎస్ లో కొనసాగానని వ్యాఖ్య
  • సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్న పొంగులేటి
ponguleti challenge to BRS

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... తాను పార్టీ సభ్యుడినే కానప్పుడు సస్పెండ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తాను జనవరి నుంచే విమర్శిస్తున్నానని చెప్పారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ లోకి రావాలని ఎంతో ఒత్తిడి చేశారని.. కేటీఆర్ తనతో ఎన్నోసార్లు మాట్లాడి కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారని అన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని కేసీఆర్ చెప్పారని... ఆయన మాటలు విని మోసపోయానని తెలిపారు. 

తమకు పట్టిన గతే మీకూ పడుతుందని అప్పుడే తనకు బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు చెప్పారని పొంగులేటి అన్నారు. 6 నెలలు అంతా బాగుంటుందని ఆ తర్వాత మా సార్ కేసీఆర్ అసలు స్వరూపం తెలుస్తుందని తన తోటి ఎంపీలు చెప్పారని... కానీ, నాకు ఐదు నెలల్లోనే పరిస్థితి అర్థమయిందని చెప్పారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను కేటీఆర్ కోసం పార్టీలో కొనసాగానని అన్నారు. 

గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి కేవలం ఒక్క సీటును మాత్రమే బీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. 2023లో ఆ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాదని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ఎమ్మెల్యేగా గెలవనివ్వనని అన్నారు. జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని అన్నారు. బీఆర్ఎస్ లో మోసపోయిన నేతలను ఒక తాటిపైకి తెస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పోటీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఉంటుందని అన్నారు.

More Telugu News