BRS: ఇన్నాళ్లూ నేను పార్టీలో ఉన్నట్లా.. లేనట్లా?: జూపల్లి

Feeling so Happy says jupalli krishnarao about brs suspension
  • సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్న జూపల్లి 
  • ఈ రాష్ట్రం నాది.. నేనేం చేసినా అడగొద్దనేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని ఆరోపణ
  • తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు భయపడుతున్నారని విమర్శ
టీఆర్ఎస్సో.. బీఆర్ఎస్సో.. ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జూపల్లి మాట్లాడారు. తనను సస్పెండ్ చేసినట్లు వినగానే పంజరంలో నుంచి బయటపడ్డ చిలుకలా అనిపించిందని అన్నారు. ఇన్నాళ్లూ తాను పార్టీలో ఉన్నట్లా లేనట్లా అని అడిగారు. నేనైతే పార్టీలో ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు తనను సస్పెండ్ చేశామంటున్నారు కాబట్టి ఇప్పటి వరకూ పార్టీలోనే ఉన్నట్లు తెలిసిందని అన్నారు.

తన సస్పెన్షన్ పై వందిమాగధులతో మీడియా సమావేశం పెట్టించడం కాకుండా సీఎం కేసీఆర్ తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో, తాను అడిగిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా అని అడిగారు. ఒకవేళ తన మాటలు అబద్ధాలని అంటే నిజానిజాలు నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి సవాల్ విసిరారు. తన ప్రశ్నలకు బదులివ్వలేక సస్పెండ్ చేశారని ఆరోపించారు.

‘ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త అని, యావత్ ప్రజానీకానికి జవాబుదారీ. పారదర్శకంగా పాలన అందించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి’ అని జూపల్లి చెప్పారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ బాధ్యతను మరిచారని అన్నారు. ‘ఈ రాష్ట్రం నాది.. నా ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడ్తా. నచ్చినట్లు దానధర్మాలు చేస్తా. అడిగేందుకు మీరెవ్వరు’ అన్నట్లు కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అన్నివర్గాల ప్రజల పాత్ర ఉందని, వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే రాష్ట్రం వచ్చిందని అన్నారు. ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని జూపల్లి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం ఆశిస్తున్నామని జూపల్లి తెలిపారు.
BRS
jupalli
suspension
KCR
jupalli pressmeet

More Telugu News