Rinku Singh: గ్రౌండ్ దాటిన ప్రతి బంతి వారికే అంకితం: రింకూ సింగ్

Every Ball That I Hit Out Of Ground Dedicated To the people who sacrificed so much for me says KKRs Rinku Singh
  • నిన్నటి మ్యాచ్ లో వరుస సిక్సర్లతో కేకేఆర్ ను గెలిపించిన రింకూ సింగ్
  • తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని వెల్లడి
  • తన కోసం త్యాగాలు చేసిన వ్యక్తులకు సిక్సర్లను అంకితం చేస్తున్నానని వ్యాఖ్య
‘‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు’’ ఖలేజా సినిమాలోని డైలాగ్ ఇది. నిన్న సాయంత్రం కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్ బ్యాటింగ్ కూడా ఇలాంటి ఓ అద్భుతమే.

ఎవ్వరూ ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు రింకూ సింగ్. చివరి ఓవర్ లో 29 పరుగులు అవసరమైతే.. తాను ఆడిన 5 బంతులకు 5 సిక్సుల కొట్టి తిరుగులేని విజయాన్ని కోల్ కతాకు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో చివరి ఓవర్ లో అత్యధిక పరుగులను ఛేదించిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. 

మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డాడు. రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను కొట్టిన ప్రతి బంతి.. నా కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తులకు అంకితం చేస్తున్నా’’ అని చెప్పాడు. 

నిజానికి రింకూ సింగ్ గత ఐపీఎల్ సీజన్ లోనూ ఇలాంటి ఆటే ఆడాడు. కానీ టీమ్ ను గెలిపించలేకపోయాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో 21 పరుగులు అవసరం కాగా.. 4, 6, 6, 2.. మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కానీ 2 బంతుల్లో 3 పరుగులు కొట్టాల్సిన టైమ్ లో ఔట్ అయ్యాడు. ఆ విషయాన్ని తాజాగా రింకూ గుర్తు చేసుకున్నాడు. 

‘‘నేను చేయగలను అనే నమ్మకం ఉంది. గతేడాది కూడా లక్నోతో మ్యాచ్ లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. అందుకే ఎక్కువగా ఆలోచించలేదు. ఒక దాని తర్వాత ఒకటి అలా (సిక్స్ లు) జరిగిపోయాయి’’ అని చెప్పుకొచ్చాడు. 

కేకేఆర్ సారథి నితీశ్ రానా మాట్లాడుతూ.. ‘‘రింకూ గత సంవత్సరం ఇలాంటిదే చేశాడు. కానీ మేం ఆ మ్యాచ్‌లో గెలవలేదు. (నిన్నటి మ్యాచ్ లో) రెండో సిక్స్ కొట్టినప్పుడు మాకు నమ్మకం వచ్చింది. యష్ దయాల్ అంత బాగా రాణించలేకపోతున్నాడని అర్థమైంది. గెలుపు క్రెడిట్ రింకూ సింగ్ దే’’ అని చెప్పాడు.
Rinku Singh
Kolkata Knight Riders
Nitish Rana
5 sixes in 5 balls
IPL 2023

More Telugu News