Tiger census: పులుల సంతతిని ఎలా లెక్కిస్తారంటే..

  • ప్రాజెక్ట్ టైగర్ కు 50 వసంతాలు..
  • 1973 ఏప్రిల్ లో మొదలైన ప్రాజెక్టు
  • దేశంలో పులుల సంరక్షణే లక్ష్యంగా ప్రారంభం
  • 2018 లెక్కల ప్రకారం మన దేశంలోని పులుల సంఖ్య 2,461
How are tigers counted in the wild

దేశంలో అంతరించిపోతున్న పులుల సంతతిని కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించి ఈ నెల 1వ తేదీతో 50 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అటవీ శాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా మన దేశంలో ప్రస్తుతం ఉన్న పులుల సంతతి ఎంతనేది ఆదివారం వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో పులుల సంతతిని ఎలా లెక్కిస్తారు.. అందుకు ఉపయోగించే పద్ధతులు ఏంటనే వివరాలు తెలుసుకుందాం. మన దేశంలోని పులుల సంతతిని లెక్కించడం 1973లో ప్రారంభించారు. మొదట్లో పులుల సంఖ్యను లెక్కించడానికి అటవీ సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చేది. కాలక్రమంలో టెక్నాలజీ సాయంతో కొద్దిగా శ్రమ తగ్గినా ఇప్పటికీ ఈ ప్రక్రియ చాలా కష్టమేనని అధికారులు అంటున్నారు. కాగా, 2018 గణన ప్రకారం మన దేశంలోని పులుల సంఖ్య 2,461 అని అధికారులు తెలిపారు.

పంజా గుర్తుల ఆధారంగా..
పులులను లెక్కించడానికి రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తొలినాళ్లలో పులుల కాలి గుర్తుల (పంజా) ఆధారంగా వాటి సంతతిని లెక్కించేవారని తెలిపారు. పులులు తిరిగే ప్రదేశాల్లో గ్లాస్, బట్టర్ పేపర్ లను అమర్చి పంజా గుర్తులను సేకరిస్తామన్నారు. మన వేలిముద్రల తరహాలోనే ప్రతీ పులి పంజా గుర్తులు వేర్వేరుగా ఉంటాయని, ఆ తేడాల ఆధారంగా పులుల సంఖ్యను లెక్కిస్తామని వివరించారు. అయితే, పులి పంజా గుర్తులు కూర్చున్నపుడు ఒకవిధంగా, నిలుచున్నపుడు మరోవిధంగా, పరిగెత్తే సమయంలో మరొకలా ఉంటాయని తెలిపారు. 

పులులకు గుర్తు వేయడం..
పులుల సంతతిని లెక్కించడానికి చాలా కాలంపాటు అమలులో ఉన్న పద్ధతి ఇది. నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అటవీ ప్రాంతంలో తిరిగే పులులలో కొన్నింటిని పట్టుకుని, వాటికి గుర్తులు (స్టాంప్) వేయాలి. ఆపై వాటిని తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెట్టాలి. కొంతకాలం గడిచిన తర్వాత మరొకసారి కొన్ని పులులను పట్టుకోవాలి. ఇందులో స్టాంప్ గుర్తు ఉన్న పులులు ఎన్ని ఉన్నాయనేది లెక్కించాలి. పట్టుకున్న పులుల గుంపులో స్టాంప్ వేసిన పులుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ ఏరియాలో పులుల సంతతి తక్కువగా ఉందని అర్థం. ఈ పద్ధతి ద్వారా దేశంలోని పులుల సంతతిని అంచనా వేయొచ్చు.

కెమెరా ట్రాప్ ల ద్వారా..
టైగర్ రిజర్వ్ లలో కెమెరాలను అమర్చడం ద్వారా పులుల సంతతిని లెక్కించడం మరో పద్ధతి. ఇందులో ఒక్కో పులిని ఫొటో తీసి మొత్తం పులుల సంఖ్యను గుర్తిస్తారు. పులి చర్మంపైన ఉండే చారలు కూడా ఒక్కో పులికి ఒక్కోలా ఉంటాయట. ఈ తేడాలను గుర్తిస్తూ ఫొటోల ద్వారా పులుల సంఖ్యను లెక్కించవచ్చు. పులులు తరచుగా తిరిగే ప్రాంతాల్లో మోకాలి ఎత్తులో ఈ కెమెరాలను అమర్చాల్సి ఉంటుంది. పులిని రెండు వైపులా ఫొటో తీసేందుకు జంట కెమెరాలను అమర్చాలని అధికారులు చెప్పారు.

ప్రాంతాల వారీగా విభజన..
పులుల సంతతిని లెక్కించడానికి దేశాన్ని పలు ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతంలోని పులుల సంతతిని గుర్తించే ఏర్పాట్లు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. గంగానది మైదానాలు, మధ్య భారతదేశం, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, బ్రహ్మపుత్ర వరద మైదానాలు, సుందర్బన్స్ గా విభజించి 2018 లో గణన పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 3,81,400 చదరపు కిలోమీటర్లు సర్వే చేశామని, మొత్తం 141 చోట్ల 26,838 కెమెరాలను ఉపయోగించామని పేర్కొన్నారు.

More Telugu News