Rajasthan Royals: జైశ్వాల్, బట్లర్, హెట్మెయర్ బౌండరీల వర్షం... రాజస్థాన్ భారీ స్కోరు

  • గువాహటిలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసిన రాజస్థాన్
  • భారీ షాట్లతో విరుచుకుపడిన జైస్వాల్, బట్లర్, హెట్మెయర్
  • లక్ష్యఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ
  • సున్నా పరుగులకే 2 వికెట్లు డౌన్
Rajasthan Royals set Delhi Capitals 200 runs target

ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ దూకుడైన ఆరంభం అందించగా... ఆఖర్లో షిమ్రోన్ హెట్మెయర్ సిక్సర్ల మోత మోగించిన వేళ... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు నమోదు చేసింది. 

ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ తొలి వికెట్ కు 98 పరుగులు జోడించి పటిష్ఠ పునాది వేశారు. జైస్వాల్ 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 60 పరుగులు చేయగా... బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 79 పరుగులు సాధించాడు. 

కెప్టెన్ సంజు శాంసన్ (0), రియాన్ పరాగ్ (7) విఫలమైనా... హెట్మెయర్ జూలు విదిల్చడంతో ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు లభించాయి. హెట్మెయర్ 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 2, కుల్దీప్ యాదవ్ 1, రోవ్ మాన్ పావెల్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 200 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా, వన్ డౌన్ బ్యాట్స్ మన్ మనీశ్ పాండే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. 

పృథ్వీ షా... ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో వికెట్ కీపర్ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే మనీశ్ పాండే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దాంతో ఢిల్లీ సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

More Telugu News