Posani Krishna Murali: నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

Posani sensational comments on Nandi awards
  • నంది అవార్డులపై అపోహలు ఉన్నాయన్న పోసాని
  • అవి కమ్మ, కాపు అవార్డులని విమర్శలు
  • నంది అవార్డుల కమిటీలో 12 మంది సభ్యుల్లో 11 మంది కమ్మవారేనని వ్యాఖ్యలు
ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నంది అవార్డులు, ఇండస్ట్రీ తీరుతెన్నులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల విజేతల ఎంపికపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంది పురస్కారాల అంశంలో అనేక అపోహలు ఉన్నాయని అన్నారు. అవి నంది అవార్డులు కావని... కమ్మ, కాపు అవార్డులని విమర్శించారు. నంది అవార్డులను గ్రూపులు, కులాల వారీగా పంచుకున్నారని ఆరోపించారు. అందుకే గతంలో నాకు ఇచ్చిన నంది అవార్డును కూడా వద్దనుకున్నాను అని పోసాని వివరించారు. నంది అవార్డు కమిటీలోని 12 మంది సభ్యుల్లో 11 మంది కమ్మ వారేనని వ్యాఖ్యానించారు. 

"ఆ కాంపౌండ్ కు రెండు అవార్డులు పోతే, ఈ కాంపౌండ్ కు రెండు అవార్డులు రావాలి... ఆ డైరెక్టర్ కు రెండు అవార్డులు ఇస్తే నాకు మూడు ఇవ్వాలి... ఇవ్వకపోతే నేను వెళ్లను...అలుగుతాను, నంది తీసుకోను అనేవి మనం చూశాం. దీనిపై నేను గతంలో మీడియా సాయంతో పోరాటం చేశాను. దాని పర్యవసానం ఏమిటంటే... పోసాని అనేవాడికి ఇక నంది అవార్డు ఇవ్వకూడదని నిర్ణయించారు. 

గాయం, పవిత్రబంధం, పెళ్లిచేసుకుందాం, శివయ్య, ప్రేయసి రావే, ఆపరేషన్ దుర్యోధన ఇవన్నీ నేను రాసినవే... వీటిల్లో దేనికైనా నాకు నంది అవార్డు ఇచ్చారా? కానీ నేను అలగలేదు. నేను రచయితగా ఉన్నప్పుడే నంది అవార్డుల విషయంలో కొందరిని పేరు పెట్టి మరీ ప్రశ్నించాను. 

ఈ మధ్య కాలంలో నా ఖర్మ కాలి టెంపర్ సినిమాలో నాకు నంది అవార్డు ఇచ్చారు. అయితే ఎవరెవరికి అవార్డులు ఇచ్చారో ఓసారి పరిశీలిస్తే... నాకు లభించింది కమ్మ అవార్డు అనిపించింది. అసలు, ప్రతి ఏడాది నంది అవార్డులు ఎందుకు వివాదాస్పదమవుతున్నాయో జవాబే లేదు.... అడిగితే చెప్పేవాడు లేడు. ఒకవేళ అడిగితే వచ్చిన నంది కూడా వెనక్కి పోతుంది. 

కల్యాణ్ వంటి పెద్ద మనిషితో వెళ్లి సీఎం జగన్ తో మాట్లాడి ఈ విషయాలన్నీ చర్చిస్తాం. గతంలో ఇవ్వని నంది అవార్డుల సంగతి పక్కనబెట్టి తాజాగా నంది అవార్డులు ఇచ్చే విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. దీనిపై కొంత సమయం కోరుతున్నాం" అని పోసాని వివరించారు.
Posani Krishna Murali
Nandi Awards
Tollywood

More Telugu News