Bandi Sanjay: బండి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిలు.. నేడు జైలు నుంచి బయటకు!

Bail Issued to BJP Telangana Chief Bandi Sanjay in 10th paper leak
  • పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్ట్
  • హనుమకొండ కోర్టులో 8 గంటలపాటు వాదనలు
  • రాత్రి 10 గంటలకు బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి
  • సాక్షులను ప్రభావితం చేయొద్దని, ఆధారాలను ధ్వంసం చేయొద్దని ఆదేశం
  • ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు బనాయించిందన్న సంజయ్ తరపు న్యాయవాదులు
  • బెయిలుతో బీజేపీ నేతల సంబరాలు
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌కు బెయిలు మంజూరైంది. అంతకుముందు హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరిగాయి. బండి సంజయ్ తరపున విద్యాసాగర్‌రెడ్డి, చొల్లేటి రామకృష్ణ, వైం.శ్యాంసుందర్‌రెడ్డి, సంసాని సునీల్ వాదించగా, ప్రాసిక్యూషన్ తరపున రేవతి వాదించారు. 

సంజయ్‌కు బెయిలు ఇస్తే ఈ కేసులో ఇప్పటికే సేకరించిన ఆధారాలను నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది. కాబట్టి బెయిలు ఇవ్వొద్దని కోర్టును వేడుకుంది. ఈ కేసులో బెయిలు లభిస్తే మళ్లీమళ్లీ పేపర్ లీకేజీ ఘటనలు జరిగే అవకాశం ఉందని రేవతి వాదించారు. ఆయనకు బెయిలు లభిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉందని, అది శాంతిభద్రతల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది రేవతి వాదించారు.

ఈ వాదనల్లో నిజం లేదని, బూర ప్రశాంత్‌తో కలిసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సంజయ్ మీద కేసులు నమోదు చేశారని, అందులో సెక్షన్లన్నీ తప్పుడు కేసులేనని సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు. తన క్లయింట్ ఇప్పటి వరకు ఎవరినీ మోసం చేయలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నారని అన్నారు. ఆయనను రిమాండులో ఉంచడం ద్వారా ఆయన కుటుంబం ఇబ్బంది పడుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 8న మోదీ రాష్ట్రానికి వస్తుండడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కూడా హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్టు ఆధారాలను చెరిపేసే అవకాశాలు లేవని, న్యాయస్థానం విధించే షరతులకు లోబడి ఆయన నడుచుకుంటారని చెప్పారు.

దాదాపు 8 గంటల హోరాహోరీ వాదనల తర్వాత రాత్రి 10 గంటలకు ఇన్‌చార్జి న్యాయమూర్తి రాపోలు అనిత బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు. రూ. 20 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరు జమానతు సమర్పించాలని ఆదేశించారు. అలాగే సంజయ్‌కు కొన్ని షరతులు కూడా విధించారు. సాక్షులను ప్రభావితం చేయకూడదని, దేశం విడిచి వెళ్లరాదని, కేసు విచారణకు సహకరించాలని ఆదేశించారు. రాత్రి పది గంటల సమయంలో బెయిలు మంజూరు కావడంతో ఈ ఉదయం ఆయన కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 

కాగా, ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న బూర ప్రశాంత్,  ఏ-3 గుండబోయిన మహేశ్‌లను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. కాగా, బండి సంజయ్‌కు బెయిలు మంజూరు కావడంతో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
Bandi Sanjay
10th Paper Leak
BJP
Bail For Bandi Sanjay

More Telugu News