Pilli Manikya Rao: జగన్ ఇప్పుడు చుక్కల భూములపై పడ్డాడు: పిల్లి మాణిక్యరావు

  • టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రెస్ మీట్
  • దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్నవారి వివరాలు వెల్లడించాలని డిమాండ్
  • హైకోర్టు నివేదిక రాకుండా ఎలా చర్యలు తీసుకుంటారని నిలదీసిన మాణిక్యరావు
TDP Spokesperson Pilli Manikya Rao take a dig at CM Jagan

నాలుగేళ్లలో లక్షల ఎకరాలు కొల్లగొట్టిన జగన్, ఇప్పుడు పేదల సాగులో ఉన్న చుక్కల భూములపై పడ్డాడని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. దశాబ్దాల నుంచి భూములు సాగుచేసుకుంటున్నవారి వివరాలు బయటపెట్టకుండా, హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు ఆగకుండా చుక్కల భూముల చిక్కులను ఎలా విప్పుతుందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. 

22 ఏ పరిధిలోని భూముల్ని ఏళ్ల నుంచి సాగుచేసుకుంటున్నవారికి  కాకుండా వైసీపీ వారికి కట్టబెట్టాలన్నదే ప్రభుత్వ దురాలోచన అని విమర్శించారు. రికార్డుల్లో నమోదుకాని భూముల్ని దశాబ్దాల నుంచి సాగుచేసుకుంటున్నవారికి కాకుండా ఎవరి పరం చేయడానికి ప్రయత్నిస్తున్నారో పాలకులు ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు. 

జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని భూముల్ని పంచభక్ష్య పరమాన్నాలుగా భుజిస్తున్నాడని, ముఖ్యమంత్రికి భూములంటే ఎంతోమోజు  అని, వై.ఎస్.రాజారెడ్డి మైన్స్ ఉన్న వ్యక్తిని చంపి, అతని భూముల్ని లాక్కుంటే, అతని బాటలోనే మనవడు జగన్ నడుస్తున్నాడని పిల్లి మాణిక్యరావు విమర్శించారు. విజయసాయి రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల వంటివారిసాయంతో రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు చేస్తున్నాడని అన్నారు.

"హైకోర్టు ద్వారా ఏర్పాటైన ఒక కమిటీ ఇప్పటికే చుక్కల భూముల సమస్య పరిష్కారంపై విచారణ జరుపుతుంటే, సదరు కమిటీ దర్యాప్తు పూర్తికాకముందే,  జగన్ చుక్కల భూముల్ని ఆక్రమించడానికి కొత్త నాటకానికి తెర లేపాడు. రాష్ట్రంలో 1.81 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవలే సాక్షి పత్రికలో ప్రకటన ఇచ్చింది. 

22 ఏ (1)బీ కింద, 22 ఏ (1) సీకింద, 22ఏ(1) ఈ కింద ఉన్నభూములు చాలావరకు చిన్న చిన్న కమతాలుగా పేదలు సాగు చేసుకుంటున్నవే. శిస్తు కట్టలేని రైతులు భూముల సర్వేకు విముఖత చూపడంతో ఆ భూములు ఎవరివో రికార్డుల్లో నమోదు కాలేదని చెబుతున్నారు. రికార్డుల్లో నమోదు కాని ఆ భూముల్ని ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న పేదలకు ఇస్తారా? లేక, వైసీపీ నేతలకు కట్టబెడతారా? అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.  

22ఏ పరిధిలోని భూముల్ని ఎవరు సాగు చేసుకుంటున్నారో, వారి వివరాలు బయట పెట్టాకే ప్రభుత్వం చుక్కల భూముల సమస్య పరిష్కారానికి పూనుకోవాలి” అని టీడీపీ తరుపున మాణిక్యరావు డిమాండ్ చేశారు.

More Telugu News