millets: మిల్లెట్స్ అందరికీ సరిపడకపోవచ్చు..!

  • మిల్లెట్స్ లో ఫైబర్, మంచి పోషకాలు
  • వీటితో కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలు
  • కడుపులో మంట, కడుపుబ్బరం
  • మోస్తరుగా తీసుకోవడమే మంచిదంటున్న నిపుణులు
Dos and donts of eating millets

మిల్లెట్స్, వీటినే సిరి ధాన్యాలు అని పిలుస్తారు. వీటి వాడకం క్రమంగా పెరుగుతోంది. ఫైబర్ తో పాటు మంచి పోషకాలతో కూడిన సిరి ధాన్యాలు.. కేవలం కార్బో హైడ్రేట్లు మాత్రమే ఉండే వైట్ రైస్ కంటే మంచివని చాలా మంది తెలుసుకుంటున్నారు. అయితే అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మరి కొన్ని ఉన్నాయి. 

మిల్లెట్స్ అందరికీ అనుకూలమని చెప్పలేం. రైస్, వీట్ తినే వారు పూర్తిగా మిల్లెట్స్ కు మారిపోవడం అంత సులభం కాకపోవచ్చు. కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు లేని వారే మిల్లెట్స్ ను తీసుకోవాలన్నది నిపుణుల సూచన. మిల్లెట్స్ కు సంబంధించి పెద్దగా తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలను ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ దీపాలి షేర్ చేశారు.

ప్రయోజనాలు
రోజువారీ మిల్లెట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు మిల్లెట్స్ ఆహారం సాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంతోపాటు, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గాల్ స్టోన్స్ తో బాధపడుతున్న వారికీ ఇవి అనుకూలమే. గ్లూటెన్ పడని వారు మిల్లెట్స్ ను తీసుకోవచ్చు. 

కొందరికి పడకపోవచ్చు..
మిల్లెట్స్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయనేది నిజమే. కానీ, కొందరికి మిల్లెట్స్ ఆహారం సరిపడక జీర్ణ సమస్యలు కనిపిస్తుంటాయి. కడుపులో మంట, కడుపుబ్బరం రావచ్చు. కనుక ఒకేసారి మిల్లెట్స్ కు మారిపోవడం కాకుండా క్రమంగా మారే ప్రయత్నం చేయాలి. కడుపులో మంట, ఉబ్బరం అనిపించే వారు మొదట కోడో, బర్న్ యార్డ్ తో మొదలు పెట్టుకోవాలి. తర్వాత జోవర్, బజ్రా యాడ్ చేసుకోవచ్చు. 

మిల్లెట్స్ అందరికీ పనిచేస్తాయన్నది నిజం కాదని నిపుణులు అంటున్నారు. మిల్లెట్స్ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలు లేని వారే కొనసాగించుకోవాలన్నది సూచన. కాకపోతే రైస్ మాదిరిగా మిల్లెట్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. మోస్తరుగా, వారంలో నాలుగు రోజుల వరకు తీసుకోవచ్చు. హైపో థైరాయిడిజం ఉన్న వారికి సూచనీయం కాదు. మిల్లెట్స్ ను తీసుకునే వారు తగినంత నీరు తాగుతుండాలి. ఒక్క ధాన్యానికే పరిమితం కాకుండా, మారుస్తూ ఉండాలి. జొన్న, రాగి, ఫాక్స్ టైల్ మిల్లెట్, బర్న్ యార్డ్ ను వేసవిలో తీసుకోవచ్చు.

More Telugu News