Kerala: రైలులో ప్రయాణికుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన నిందితుడి అరెస్ట్.. కేరళ పోలీసులకు అప్పగింత

Suspect who set passengers ablaze on Kerala train taken into custody
  • అలప్పుజ-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన నిందితుడు
  • మహారాష్ట్రలోని రత్నగిరికి పారిపోయి కాలిన గాయాలకు చికిత్స
  • అక్కడి నుంచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
  • నిప్పంటించిన ఘటనలో చిన్నారి సహా ముగ్గురి మృతి
  • నిందితుడిని ఢిల్లీకి చెందిన షారూఖ్ సైఫీగా గుర్తించిన పోలీసులు
కేరళలో కదులుతున్న రైలులో తోటి ప్రయాణికుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఢిల్లీలోని షహీన్‌బాగ్‌కు చెందిన షారూఖ్ సైఫీ (27)గా గుర్తించారు. ఘటన తర్వాత పరారైన నిందితుడి కోసం రంగంలోకి దిగిన కేంద్ర నిఘా బృందం, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) సంయుక్తంగా గాలింపు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. 

ఆదివారం రాత్రి దాడి తర్వాత మహారాష్ట్రలోని రత్నగిరికి చేరుకున్న సైఫీ ఓ ఆసుపత్రిలో చేరి కాలిన గాయాలకు చికిత్స చేయించుకున్నాడు. అక్కడి నుంచి నిన్న పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డాడు. విషయం తెలిసి రత్నగిరికి చేరుకున్న కేరళ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. రైలులో ఘాతుకానికి పాల్పడింది తానేనని నిందితుడు అంగీకరించాడని, ఎందుకలా చేశాడన్న దానిపై స్పష్టత లేదని ఏటీఎస్ అధికారులు తెలిపారు. విచారణలో మిగతా విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

ఆదివారం రాత్రి అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ దాటి కొరపుజా రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో నిందితుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. రాత్రి 9.45 గంటల సమయంలో డి1 కంపార్ట్‌మెంటులోకి ప్రవేశించిన సైఫీ.. అక్కడున్న ప్రయాణికులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో డి1 కంపార్ట్‌మెంట్‌లో మొదలైన మంటలు డి2కు కూడా వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. ఆ వెంటనే రైలు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది గాయపడ్డారు.
Kerala
Ratnagiri
Alappuzha-Kannur Express
Maharashtra

More Telugu News