BJP: బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో.. బొమ్మలరామారం పీఎస్ దగ్గర ఉద్రిక్తత

  • సంజయ్ ను అరెస్టు చేసి స్టేషన్ లో ఉంచిన పోలీసులు
  • బీజేపీ రాష్ట్ర చీఫ్ ను కలిసేందుకు వెళ్లిన రఘునందన్
  • ఎమ్మెల్యేను అడ్డుకుని అరెస్టు చేసిన అధికారులు
  • ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులన్న కిషన్ రెడ్డి
policet stopped mla raghunandan rao at bommalaramaram ps

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు బొమ్మలరామారంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంజయ్ ను కలిసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రఘునందన్, రాజాసింగ్ బొమ్మలరామారం చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. బండి సంజయ్ ను ఏ నేరం కింద అరెస్టు చేశారో చెప్పాలని రఘునందన్ పోలీసులను ప్రశ్నించారు. దీనిపై పోలీసులు, రఘునందన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి నిరాకరించడంతో రఘునందన్ ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

బండి సంజయ్ అరెస్టు అక్రమమని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ తో బండి సంజయ్ కు సంబంధం లేదని, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో లీకుల పాలన నడుస్తోందని మండిపడ్డారు.

కాగా, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సంజయ్ అరెస్టు అక్రమమని ఆరోపించారు. పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ ను అరెస్టు చేశారని కేంద్రమంత్రి విమర్శించారు.

More Telugu News