Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న మూవీ మొఘల్ రూపర్ట్ మర్దోక్!

Rupert Murdoch And Ann Lesley Smith Call Off Their Engagement
  • మార్చి 17న 62 ఏళ్ల లెస్లీతో నిశ్చితార్థం
  •  స్మిత్‌తో అభిప్రాయ భేదాల వల్లే పెళ్లి ఆగిందన్న మీడియా సంస్థలు
  • నాలుగో భార్య జెర్రీ హాల్ నుంచి గతేడాది విడాకులు తీసుకున్న మర్దోక్
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ ఇటీవల తన ప్రియురాలైన మాజీ పోలీసు అధికారి చాప్లిన్ యాన్ లెస్లీ స్మిత్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. 92 ఏళ్ల వయసులో ఐదో వివాహానికి మర్దోక్ సిద్ధమయ్యారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సందర్భంగా మర్దోక్ మాట్లాడుతూ.. ఇదే తన చివరి వివాహమని కూడా స్పష్టం చేశారు. అయితే, ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ తమ నిశ్చితార్థాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు వార్తలు బయటకొచ్చాయి. నిశ్చితార్థం చేసుకుని వారాలు కూడా గడవకముందే వీరి నిర్ణయం మరోమారు హాట్ టాపిక్ అయింది.

మర్దోక్-లెస్లీ వివాహ ప్రణాళిక అకస్మాత్తుగా ఆగిపోయినట్టు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాల విషయంలో మర్దోక్ అసౌకర్యానికి గురయ్యారని, పెళ్లి ప్రణాళిక ఆగిపోవడానికి అదే కారణమని కూడా తెలిపాయి. మర్దోక్ తన నాలుగో భార్య, మోడల్ జెర్రీ హాల్‌ నుంచి గతేడాది ఆగస్టులోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత స్మిత్‌తో ప్రేమలో పడ్డారు. మార్చి 17న న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది.   

ముర్దోక్‌కు మొదటి మూడు పెళ్లిళ్ల వల్ల ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత హాల్‌ను పెళ్లి చేసుకుని ఆరేళ్లు కాపురం చేశారు. అంతకుముందు ఆయన వెండీ డింగ్‌ (1999-2013), అన్నా మారియా టోర్వ్ (1967-1999), పాట్రిసియా బూకర్ (1956-1967)లను పెళ్లి చేసుకున్నారు.

‘ఫోర్బ్స్’ ప్రకారం న్యూస్ కార్ప్ చైర్మన్, సీఈవో అయిన ముర్దోక్ సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లు. ఆయన వ్యాపార సామ్రాజ్యంలో ఫాక్స్ న్యూస్, వాల్‌స్ట్రీట్ జర్నల్ సహా ప్రపంచవ్యాప్తంగా మరెన్నో మీడియా సంస్థలు ఉన్నాయి.
Rupert Murdoch
Ann Lesley Smith
Media Barron

More Telugu News