MS Dhoni: స్టేడియంలో ఒక సీటుకు ధోని పేరు.. కారణమిదే!

  • 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను టీమిండియా గెలిచి 12 ఏళ్లు 
  • సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన ధోని
  • బంతి పడిన సీటుకు ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం
MS Dhoni To Have Seat Named After Him At Wankhede Exactly Where 2011 World Cup Winning Six Landed

2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను టీమిండియా అందుకుని 12 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీలంక‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చర్చ వచ్చినప్పుడల్లా.. ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ కళ్ల ముందు కదలాడుతుంది. క్రికెట్ అభిమానుల మనసుల్లో ఆ జ్ఞాపకం అంతలా ముద్రించుకుపోయింది. 

నాడు ధోని కొట్టిన సిక్స్.. స్టేడియంలో ఓ సీటుపై ప‌డింది. ఆ సీటుకు ఇప్పుడు ధోనీ పేరును పెట్ట‌నున్నారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ ఈ విష‌యాన్ని వెల్లడించారు. పేరు ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ధోనీని ఆహ్వానిస్తున్న‌ట్లు చెప్పారు.

వాంఖ‌డే స్టేడియంలో కొన్ని స్టాండ్స్‌కు ఇప్పటికే స‌చిన్‌, గ‌వాస్క‌ర్‌, విజ‌య్ మ‌ర్చంట్ పేర్లు ఉన్నాయి. కొన్ని గేట్ల‌కు ఉమ్రిగ‌ర్‌, వినూ మ‌న్క‌డ్ పేర్లు పెట్టారు. ఇప్పుడు వినూత్నంగా సీటుకు ధోని పేరు పెడుతున్నారు.

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి 12 ఏళ్ల అయిన సంద‌ర్భంగా ఆ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నాడు. సిక్స్ కొట్టి విజయం సాధించడం తనకు గొప్ప అనుభూతి కలిగించలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగియడానికి 15- 20 నిమిషాల ముందు తాను అద్భుతంగా ఫీలైన‌ట్లు చెప్పాడు.

‘‘అప్పటికి గెలుపు ఖరారైంది. మేం ఎక్కువ పరుగులు చేయాల్సిన పని లేదు. స్టేడియంలో ప్రేక్షకులు ‘వందేమాతరం’ పాడటం మొదలైంది. అలాంటి వాతావరణాన్ని మరోసారి సృష్టంచలేం. కానీ అలాంటి సందర్భంగా మరోసారి ఎదురైతే.. 40, 50 లేదా 60,000 మంది ప్రేక్షకులు పాడుతున్నప్పుడు మాత్రమే ఆ అనుభూతి వస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.

More Telugu News