wedding gift explodes: పెళ్లి కానుకలో హోమ్ థియేటర్ బాంబ్?.. ఆన్ చేయడంతో పేలుడు.. పెళ్లికొడుకు సహా ఇద్దరి మృతి

  • పెళ్లికి వచ్చిన గిఫ్టులను ఓపెన్ చేస్తూ సందడిగా కుటుంబం
  • కానుకల్లో హోమ్ థియేటర్.. ఆన్ చేయడంతో భారీ పేలుడు
  • ఇద్దరి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
  • తమకు గన్ పౌడర్ వాసన వచ్చిందన్న కుటుంబ సభ్యులు
  • స్పీకర్లలో పేలుడు పదార్థాలు గుర్తించామన్న పోలీసులు
  • చత్తీస్‌గఢ్‌ లోని కబీర్‌ధామ్‌ జిల్లా చమరి గ్రామంలో ఘటన
chhattisgarh groom and his brother killed after wedding gift home theatre explodes

రెండు రోజుల కిందట పెళ్లి ఘనంగా జరిగింది. ఏమేం కానుకలు వచ్చాయోనని.. కుటుంబ సభ్యులంతా కలిసి గిఫ్ట్ ప్యాక్ లను విప్పి చూస్తున్నారు. ఇంతలో హోమ్ థియేటర్ కనిపించింది. ఎలా పని చేస్తుందో చూద్దామని అనుకున్నారు. దాన్ని సెట్ చేసి, ఆన్ చేయగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు, అతడి సోదరుడు చనిపోయాడు. చత్తీస్‌గఢ్‌ లోని కబీర్‌ధామ్‌ జిల్లా చమరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి శనివారం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బంధుమిత్రులు రకరకాల కానుకలు సమర్పించారు. సోమవారం ఉదయం 11.30 సమయంలో.. కుటుంబ సభ్యులంతా కలిసి పెళ్లి గిఫ్టులను ఓపెన్ చేస్తూ సంతోషంగా ఉన్నారు. అంతా సందడిగా ఉంది. 

కానీ హోమ్ థియేటర్ పేలడంతో ఒక్క క్షణంలో పరిస్థితి మారిపోయింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు, గోడలు మొత్తం కూలిపోయాయి. హేమేంద్ర ఘటనాస్థలిలోనే చనిపోయాడు. అతని సోదరుడు రాజ్‌కుమార్‌తోపాటు మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజ్‌కుమార్‌ చనిపోయాడు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉన్నాడు. 

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోమ్‌ థియేటర్‌ ప్రమాదవశాత్తు పేలిందా? లేక ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమకు గన్ పౌడర్ వాసన వచ్చిందని, స్పీకర్లలో పేలుడు పదార్థాలను ఉంచారని కుటుంబ సభ్యులు చెప్పారు. స్పీకర్ బాక్సుల్లో పేలుడు పదార్థాలను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టు రాకముందే స్పందించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. 

‘‘కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది’’ అని పోలీసులు తెలిపారు. కుట్రకోణంపై స్పందించేందుకు నిరాకరించారు. ఒకటీరెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు.

More Telugu News