KTR: ఫేక్ సర్టిఫికెట్లు ఉన్న ఈ ఇద్దరు తెలంగాణ బీజేపీ ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా?: కేటీఆర్

Two Telangana BJP MPs have fake certificates says KTR
  • బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపులో చాలా మందే ఉన్నట్టున్నారన్న కేటీఆర్
  • ఇద్దరు టీఎస్ బీజేపీ ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లు అని ఆరోపణ
  • అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్న
ఓవైపు ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ పై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. మోదీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది. మరోవైపు, ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు. 

బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు వ్యక్తులు చాలా మందే ఉన్నట్టున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లని చెప్పారు. రాజస్థాన్, తమిళనాడు యూనివర్శిటీల్లో చదివినట్టు వారి వద్ద తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ వీటిని పరిశీలించి ఆ ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా? అని ప్రశ్నించారు.
KTR
BRS
BJP
MPs
Fake Certificates

More Telugu News