Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వస్తే రాప్తాడు, ధర్మవరం భూకబ్జాలపై సిట్ వేస్తాం: లోకేశ్

  • కృష్ణంరెడ్డిపల్లిలో మహిళలతో లోకేశ్ ముఖాముఖి
  • సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత
  • మహిళలకు పలు హామీలు ఇచ్చిన లోకేశ్
Lokesh held meeting with women

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.. పాదయాత్రలో భాగంగా కృష్ణంరెడ్డిపల్లిలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల మహిళలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 10వేల మందితో జాకీ సంస్థ కోసం పోరాడితే మహిళలపై కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన మహిళలు స్పందిస్తూ... టీడీపీ అధికారంలోకి వస్తే మహిళల ఆర్థిక అభివృద్ది కోసం ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. అందుకు లోకేశ్ బదులిచ్చారు. 

అమరరాజా, రిలయన్స్, జాకీ ఇలా అనేక కంపెనీలు జగన్ వేధింపులు తట్టుకోలేక పారిపోయాయని వెల్లడించారు. 6 వేల మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమను రాప్తాడు ఎమ్మెల్యే 15 కోట్లు డిమాండ్ చేసి పక్క రాష్ట్రానికి తరిమేశాడని ఆరోపించారు. రాప్తాడుకు జాకీ లాంటి మరో పెద్ద సంస్థని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జాకీ కోసం పోరాడిన వారిపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు మాఫీ చేస్తాం అని భరోసా ఇచ్చారు. 

"టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వైసీపీ భూ అక్రమాలపై సిట్ వేస్తాం. రాప్తాడు, ధర్మవరంలో జరిగిన భూకబ్జాలపై ప్రత్యేక సిట్ వేసి దర్యాప్తు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాలు మారినా వచ్చిన పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా బలమైన చట్టం తీసుకొస్తాం. మహిళా ఆటో డ్రైవర్ల ను ఆదుకుంటాం. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. పన్నులు తగ్గిస్తాం. జరిమానాల వేధింపులు లేకుండా చేస్తాం" అని వివరించారు. 

ఇక, హిజ్రాలు కూడా లోకేశ్ తో తమ సమస్యలు చెప్పుకున్నారు. హిజ్రాలకు టీడీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అంటూ లోకేశ్ వద్ద హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. 

దీనిపై లోకేశ్ స్పందిస్తూ...  హిజ్రాలకి దేశంలోనే మొదటి సారిగా పెన్షన్ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం అని వెల్లడించారు. హిజ్రాలు సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని పెన్షన్ ఇచ్చామని స్పష్టం చేశారు. కానీ, జగన్ హిజ్రాలకు ఇచ్చే పెన్షన్ కూడా తీసేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిజ్రాలకు మళ్లీ పెన్షన్ అమలు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

More Telugu News