South Central Railway: స్టేషన్‌లో జారిపోయిన చెప్పు.. ప్రయాణికుడి ట్వీట్‌కు రైల్వే అధికారుల నుంచి ఊహించని స్పందన!

  • స్టేషన్ ఘనపూర్ రైలు ఎక్కుతున్న సమయంలో జారిపోయిన చెప్పు
  • ఇష్టమైన కొత్త చెప్పుల్లో ఒకటి పట్టాలపై పడిపోయిందని ట్వీట్
  • వెంటనే స్పందించిన సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత
  • చెప్పు వెతకాలని కాజేపేట రైల్వే పోలీసులకు అదేశాలు
  • దొరికిన చెప్పును పోగొట్టుకున్న యువకుడికి అప్పగింత
Secunderabad Railway Officers Immediate Response to a Passenger tweet who lost his slipper at station

రైలు ఎక్కుతుండగా స్టేషన్‌లో జారిపోయిన చెప్పును రైల్వే అధికారులు జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రయాణికుడికి అప్పగించారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కాజీపేట జంక్షన్‌లో జరిగిందీ ఘటన.

జనగామ జిల్లా చిలుపూరు మండలం పల్లగుట్టకు చెందిన రాజేశ్ (25) సికింద్రాబాద్ వెళ్లేందుకు శనివారం స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ కదులుతున్న రైలు ఎక్కే సమయంలో రాజేశ్ చెప్పు ఒకటి జారి పట్టాలపై పడిపోయింది. రైలెక్కిన తర్వాత ఆ విషయాన్ని రాజేశ్ ట్వీట్ చేశాడు. ఆ చెప్పులు కొత్తవని, అవంటే తనకు ఎంతో ఇష్టమని ట్వీట్ చేస్తూ రైల్వే అధికారులను ట్యాగ్ చేశాడు. 

ఈ ట్వీట్ చూసి స్పందించిన సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత స్పందించారు. వెంటనే కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు విషయం చెప్పి చెప్పును వెతికించారు. పట్టాలపై పడిన చెప్పును గుర్తించిన కానిస్టేబుల్ దానిని కాజీపేట స్టేషన్‌లో అప్పగించాడు. నిన్న ఈ చెప్పును అక్కడే రాజేశ్‌కు అందించారు. పోయిందనుకున్న చెప్పు తిరిగి దొరకడంతో రాజేశ్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

More Telugu News