Kapil Sibal: తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోదీ... వాళ్ల పేర్లు చెప్పాలన్న కపిల్ సిబాల్

  • తన సమాధి కట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న మోదీ
  • పేర్లు బయటపెడితే చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని వెల్లడి
  • ఇది దేశ రహస్యంలా మిగిలిపోకూడదని వ్యాఖ్యలు
Kapil Sibal asks Modi

తన పతనానికి కొందరు సుపారీ ఇచ్చారని, తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కొందరు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే. తన సమాధి కట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వారికి దేశం లోపల కొందరు, దేశం వెలుపల కొందరు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. 

సుపారీ ఇచ్చిన వ్యక్తుల పేర్లు బయటపెట్టాలని మోదీని కోరారు. పేర్లు వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకునే వీలుంటుందని అన్నారు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, విదేశాలు కానీ... వీరిలో ఎవరో చెప్పండి... ఇది దేశ రహస్యంగా మిగిలిపోకూడదు... తప్పకుండా విచారిద్దాం అని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.

భారత్ లో ప్రజాస్వామ్య మనుగడ కష్టంగా మారిందని, దేశంలో దళితులు ద్వితీయ శ్రేణి పౌరుల్లా మారిపోయారని రాహుల్ గాంధీ ఇటీవల కేంబ్రిడ్జి ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో శిక్ష పడడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు పడింది. ఈ పరిణామాలను గమనిస్తున్నామంటూ జర్మనీ, బ్రిటన్ దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News