World Cup 2011: 12 ఏళ్ల కిందట ఇదే రోజున అద్భుతం చేసిన ధోనీ సేన!

  • 2011లో ఇదే రోజున వరల్డ్ కప్ ఫైనల్
  • నాడు శ్రీలంకపై అద్భుత విజయం సాధించిన టీమిండియా
  • కళ్లు చెదిరే సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన ధోని 
India won the World Cup on this day April 2

‘‘Dhoni finishes off in style..’’ 12 ఏళ్ల కిందట కామెంట్రీ బాక్స్ లో రవిశాస్త్రి చెప్పిన ఈ మాటల్ని ఏ క్రికెట్ అభిమానీ మరిచిపోడు. ఎందుకంటే.. క్రికెట్ ను కేవలం క్రీడ మాదిరి కాకుండా మతంలా కొలిచే అభిమానులకు చిరస్మరణీయమైన జ్ఞాపకం అది. మహామహులకు సాధ్యం కాని ఘనతను ధోని సేన సాధించిన సందర్భం అది. అద్భుతాన్ని ఆవిష్కరించిన క్షణమది. టీమిండియా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న రోజు అది. 

2007 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దారుణంగా విఫలమైంది. టీమ్ అతలాకుతలమైంది. మహేంద్ర సింగ్ ధోనికి తొలుత టీ20 టీమ్ పగ్గాలు అందాయి. కొన్నాళ్లకే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ.. తొలి టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకోవడంలో కెప్టెన్ గా కీలక పాత్ర పోషించాడు. మెల్లగా జట్టును గాడిలో పెడుతూ.. వన్డే, టెస్టు పగ్గాలనూ అందుకున్నాడు. మన దేశంలోనే జరిగిన 2011 వరల్డ్ కప్ కు సిద్ధమయ్యాడు. జట్టును సిద్ధం చేశాడు.

యువరాజ్ బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించడంతో.. క్వార్టర్ ఫైనల్ లో ఆస్ట్రేలియాను, సెమీ ఫైనల్ లో దాయాది పాకిస్థాన్ ను టీమిండియా మట్టికరిపించింది. ఫైనల్ కు సిద్ధమైంది. ఏప్రిల్ 2.. సరిగ్గా ఇదే రోజున శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ జరిగింది. 2007లో టీమిండియా గ్రూప్ దశ నుంచే నిష్క్రమించడానికి శ్రీలంక కూడా ఓ కారణం. ప్రతీకారం తీర్చుకోవాల్సిన రోజు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు జయవర్ధనే అజేయ శతకం (88 బంతుల్లో 103 నాటౌట్; 13 ఫోర్లు)తో రాణించడంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, యువరాజ్ చెరో 2 వికెట్లు సాధించారు. భజ్జీకి 1 వికెట్ దక్కింది.

ఛేజింగ్‌లో భారత్ తడబడింది. ఇన్సింగ్స్ రెండో బంతికి వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్. లంక బౌలర్ లసిత్ మలింగ వైవిధ్య బంతులకు భారత్ 31 పరుగులకే సచిన్ (18), వీరేంద్ర సెహ్వాగ్‌ల వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ప్రపంచ కప్ కల మరోసారి కలగానే మిగిపోతుందా అనే ఆందోళన. కానీ గౌతమ్ గంభీర్ పట్టుదల, ఓపికతో క్రీజులో కుదురుకుని జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంభీర్ వెనుదిరిగాడు. కానీ ధోనీతో కలిసి శతక భాగస్వామ్యం (109 పరుగులు) నెలకొల్పాడు. 

అప్పటికి భారత్ లక్ష్యం 52 బంతుల్లో 52. క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (24 బంతుల్లో 21 నాటౌట్) తో కలిసి ధోనీ (79 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు 2 సిక్సర్లు) జట్టుకు విజయతీరాలకు చేర్చాడు. కళ్లుచెదిరే సిక్స్ తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించి, విజయానికి కారణమైన ఎంఎస్ ధోనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టోర్నీ ఆసాంతం రాణించిన హీరో యువీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందింది.

సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కెరీర్‌లో అందుకున్న అద్భుత విజయం వన్డే వరల్డ్ కప్. రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలకు అందని ద్రాక్షగా మిగిలిన వన్డే వరల్డ్ కప్‌ను సాధించిన జట్టులో సభ్యుడిగా నిలవగానే సచిన్ ఉద్వేగానికి లోనయ్యాడు. 6వ ప్రయత్నంలో తన కల నెరవేర్చిన జట్టు సభ్యులతో, తన సొంత మైదానం వాంఖడేను చుట్టేశాడు. జట్టు సభ్యులు సచిన్ ను భుజాలపై మోశారు.

ఇంకెన్నేళ్లు గడిచినా ఆ తీయని జ్ఞాపకం.. కొత్తగానే కనిపిస్తుంది. సచిన్ ను మరిచిపోవడం ఎంత కష్టమో.. ఫైనల్ లో ధోని కొట్టిన సిక్స్ ను మరిచిపోవడం కూడా అంతే కష్టం. అందుకే ఆ వీడియోను మరోసారి చూడండి..

More Telugu News