Mekapati Vikram Reddy: వైసీపీని వీడుతున్నారనే వార్తలపై ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్పందన

  • తాను పార్టీ మారడం లేదన్న మేకపాటి విక్రమ్ రెడ్డి
  • జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా
I am not leaving YSRCP says Mekapati Vikram Reddy

ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు నెమ్మదిగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ గెలుపుకు కారణమయ్యారనే ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ అధిష్ఠానం వేటు వేసింది. వీరంతా కూడా సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దాదాపు 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ కీలక నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం కూడా విదితమే. 

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని అన్నారు. జగన్ కుటుంబంతో తమ కుటుంబానికి చాలా కాలంగా అనుబంధం ఉందని... జగన్ తోనే తన ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. 

జగన్ కు మద్దతుగా తన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండు సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తర్వాత జగన్ తమను పిలిచి ఆ సీటును ఇచ్చారని తెలిపారు. తనకు ఏ సాయం కావాలన్నా ముందుగా జగన్ నే సంప్రదిస్తానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.

More Telugu News