Poster War: హైదరాబాద్ లో మళ్లీ పోస్టర్ వార్.. ఈసారి మోదీవి!

Hyderabad Poster War PM Modis posters on Uppal flyover pillars
  • ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ హైదరాబాద్ లో పోస్టర్లు
  • ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ ఎప్పుడు పూర్తి చేస్తారని నిలదీత
  • దారి పొడవునా పిల్లర్లపై కనిపించిన పోస్టర్లు 
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం రచ్చకెక్కుతోంది. ఇప్పటికే జరుగుతున్న మీడియా, సోషల్ మీడియా యుద్ధానికి తోడు.. కొత్తగా మొదలైన పోస్టర్ల వార్ చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్ లో రాత్రికి రాత్రి పోస్టర్లు, హోర్డింగులు వెలుస్తున్నాయి. 

ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమై ఐదేళ్లు గడుస్తున్నా కనీసం సగం కూడా పూర్తి కాలేదంటూ అందులో నిలదీశారు. ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..?’ అని ప్రశ్నించారు.

‘‘పని ప్రారంభం: 05- మే-2018. 5 ఏండ్లు అయినా ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్ 40 శాతం కూడా పూర్తి కాలేదు’’ అని పోస్టర్లపై రాసుకొచ్చారు. మధ్యలో మోదీ ఫొటోను ముద్రించారు. ఫ్లై ఓవర్ పిల్లర్లు అన్నింటికీ వీటిని అతికించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిలో పిల్లర్లకు వీటిని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్లపైనా పోస్టర్లు కనిపించాయి.

గతంలో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చిన సందర్భంలో హైదరాబాద్ లో ఆయనకు వ్యతిరేకంగా పలు పోస్టర్లు వెలిశాయి. కేంద్ర మంత్రులు వచ్చిన సందర్భంలోనూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా సిటీ అంతటా పోస్టర్లు, హెర్డింగ్స్ కనిపించాయి. పది తలల రావణాసురుడిగా మోదీని చిత్రీకరించడం వివాదాస్పదమైంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తూ కూడా పోస్టర్లు వెలిశాయి. అయితే వీటన్నింటికీ ఊరు పేరు లేకపోవడం గమనార్హం. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి అతికిస్తున్నారు.
Poster War
Modi posters on Uppal flyover pillars
Narendra Modi
BJP
BRS

More Telugu News