Rahul Gandhi: రాహుల్ గాంధీ కేసును జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం: అమెరికా

USA says it is closely watching Rahul Gandhi court cases
  • రాహుల్ పార్లమెంట్ సభ్యత్వ రద్దుపై అమెరికా కీలక వ్యాఖ్య
  • ఈ విషయంలో దాఖలైన కోర్టు కేసులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడి
  • భావప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి కీలకమన్న అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దుకు సంబంధించిన కోర్టు కేసులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ సోమవారం పేర్కొన్నారు. ప్రజాస్వామిక విలువలైన భావప్రకటనా స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణ విషయంలో భారత్‌తో అమెరికా నిత్యం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.

‘‘చట్టబద్ధ, న్యాయసమ్మతమైన పాలన ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం. ఇక భారత కోర్టుల్లోని రాహుల్ గాంధీకి సంబంధించిన కేసులను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రజాస్వామిక విలువలైన భావప్రకటనా స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణపై భారత్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం’’ అని ఆయన మీడియా వర్గాలతో వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి మానవ హక్కుల పరిరక్షణ ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో సన్నిహిత దౌత్య సంబంధాలున్న దేశాల్లోని ప్రతిపక్షాలతో చర్చలు చేపట్టడమనేది అమెరికా అనుసరించే ప్రామాణిక విధానమని ఆయన వివరించారు. 

మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు మార్చి 23న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష కూడా ఖరారు చేసింది. దీంతో.. మరుసటి రోజే రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దయిపోయినట్టు లోక్ సభ సెక్రెటరీ ఓ నోటిఫికేషన్ విడుదత చేశారు. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్(3)‌కున్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త, ఆభా మురళీధరన్ ఈ కేసును దాఖలు చేశారు.
Rahul Gandhi

More Telugu News