Yanamala: జగన్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అప్పులు రూ.12.50 లక్షల కోట్లు దాటిపోతాయి: యనమల

  • ప్రతి పౌరుడిపై రూ.5.50 లక్షల అప్పు ఉందన్న యనమల
  • జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని విమర్శలు
  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం, ఆర్బీఐ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి
Yanamala press meet on AP Economy

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రతి పౌరుడిపై సగటున రూ.5.50 లక్షల అప్పు భారం మోపిందని శాసనమండలి ప్రతిపక్షనాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లకు దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అటు కేంద్రం గాని, ఆర్బీఐ గానీ ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ పై మూడేళ్ల కాగ్ రిపోర్టులు తీసుకొని విశ్లేషణ చేయడం జరిగిందని వెల్లడించారు. "జగన్ రెడ్డి పాలన అంతమయ్యే సమయానికి ఓపెన్ మార్కెట్ అప్పులు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటాయి. ఆఫ్ బడ్జెట్ అప్పులు కూడా దాదాపు 5 సంవత్సరాల్లో ఇంచుమించు రూ. 5 లక్షల కోట్లు అవుతాయి. ఓడీ, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్సులు మూడు కలిపి ఈ 5 సంవత్సరాల్లో రూ.5 లక్షల కోట్లకు చేరబోతున్నాయి. అన్నీ కలిపి రూ.12.50 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉంది. 

మార్చి 2024 నాటికి ఔట్ స్టాండింగ్ అప్పులు పెరగనున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్బీఐ ఇంకా అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉంది. మరోవైపు రాబోయే భవిష్యత్తు కాలంలో ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, రోజువారి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగి రూ.15,000 కోట్ల భారం ప్రజలపై పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఏటా రూ. 54,000 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతోంది. వైసీపీ ఐదేళ్ల పదవీ కాలం పూర్తయే నాటికి సరాసరి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద రూ.2,70,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించారు. 

ప్రభుత్వం సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తుందని గొప్పలు చెబుతున్నప్పటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందడం లేదని కాగ్ రిపోర్టు లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. 2019-20 వ ఆర్థిక సంవత్సరానికి రూ.48 వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2020-21 సంవత్సరానికి సంబంధించిన 1 లక్ష కోట్లకు లెక్కలు బయటకు చూపించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1,18,000 కోట్లకు లెక్కలు బహిర్గతం చేయలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. 

ఈ విధంగా భారీగా అప్పులు చేసి వాటిని లెక్కలు చూపించకుండా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల పేర్లు చెప్పి వేల కోట్ల రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం వాటిని దారి మళ్లీంచి దోచుకుంటున్నారనే విషయం స్పష్టమౌతుంది.

రాజకీయ సలహాదారులకు లక్షల్లో జీతాలా? 

ప్రభుత్వ సలహాదారులకు లక్షల్లో జీతాలు ఖర్చు చేస్తున్నారు. ఏ అర్హత ఉండి వారికి అన్ని లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు? రాజకీయ సలహాదారులకు ప్రజల డబ్బును జీతాలుగా చెల్లించే అర్హత లేదు. అధిక సంఖ్యలో తన పార్టీ అవసరాల కోసం జగన్ సలహాదారులను నియమించుకుని లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఆ భారం రాష్ట్ర ఖాజానాపై పడుతోంది. బలహీనవర్గాలకు పెద్దఎత్తున కార్పొరేషన్లు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం... ఆయా కార్పొరేషన్ల ద్వారా ఎంత మందికి ఆర్థిక లబ్ధి చేకూర్చారో చెప్పాలి. కార్పొరేషన్ల ఛైర్మన్లు కూర్చోడానికి కనీసం కుర్చీలు, సౌకర్యాలు కూడా లేవు.


వాలంటీర్లకు ప్రజాధనం ఏ విధంగా చెల్లిస్తారు?   

ప్రజల ధనంతో వాలంటీర్లను ప్రభుత్వం ఏ విధంగా నియమించింది? దాని వలన ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏంటో ఎవరికి తెలియదు. వైసీపీ పార్టీకి తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకునే వాలంటీర్లకు ప్రజాధనం ఏ విధంగా ఖర్చు చేస్తారు? ఇలా వాలంటీర్లకు ప్రజాధనం ఖర్చు చేయడం వలన ప్రభుత్వంపై అధికంగా రెవెన్యూ భారం పడుతోంది" అంటూ యనమల వివరించారు.

More Telugu News