Gujarat: ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే పక్కనే కూర్చున్న బిల్కిస్ బానో దోషి

Bilkis Bano case convict seen sharing stage with BJP MP MLA at Gujarat event
  • గుజరాత్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు
  • ఫొటోలను ట్వీట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
  • అత్యాచార కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ ఖైదీలను గతేడాది విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వం
బిల్కిస్ బానో అత్యాచార దోషులు మరోసారి వార్తల్లోకి వచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతేడాది 11 మంది దోషులను విడుదల చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. యావజ్జీవ ఖైదు పడి క్షమాబిక్షతో విడుదలైన అత్యాచార దోషులకు పూలమాలలతో స్వాగతం పలకడం వివాదాస్పదమైంది. ఇప్పుడు దోషుల్లో ఒకరు గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో వేదికను పంచుకోవడం చర్చనీయాంశమైంది.  

ఈ నెల 25న దహోడ్ జిల్లా కర్మాడీ గ్రామంలో నీటి సరఫరా పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ జస్వంత్ సిన్హ్ భభోర్, ఆయన సోదరుడు ఎమ్మెల్యే శైలేశ్ భభోర్‌లు హాజరయ్యారు. వారితో పాటు బిల్కిస్ బానో అత్యాచార కేసు దోషి శైలేశ్ చిమ్నాలాల్ భట్ కూడా పాల్గొన్నాడు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్ర ఈ ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇలాంటి నేరస్తులను తిరిగి జైలుకు పంపాలన్నారు.  

కాగా, శైలేష్ ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమంలో అతడు పాల్గొనడం చర్చనీయాంశమవుతోంది. దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఇటీవల అంగీకరించింది.
Gujarat
Bilkis Bano
BJP MP
MLA
stage
convict

More Telugu News