UK: భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలమైంది: విదేశాంగ మంత్రి జైశంకర్
- ఖలిస్థానీ నిరసనలపై తొలిసారిగా స్పందించిన జైశంకర్
- భద్రత కల్పించడం ఆతిథ్య దేశానికున్న బాధ్యతన్న మంత్రి
- ఇతరుల ఆస్తుల విషయంలో కొన్ని దేశాలు అశ్రద్ధగా ఉంటున్నాయని చురక
ఖలిస్థానీ వాదులు భారతీ జాతీయ జెండాను అగౌరవపరచడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తొలిసారిగా స్పందించారు. భారత్ రాయబార కార్యాలయానికి భద్రత కల్పించడంలో బ్రిటన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ‘‘విదేశీ దౌత్యాధికారులకు కావాల్సిన భద్రత కల్పించడం ఆతిథ్య దేశానికున్న బాధ్యత. విదేశీ రాయబార కార్యాలయాల గౌరవం నిలబడేలా చర్యలు తీసుకోవాలి. కానీ..ఇలా జరగలేదు. ఈ విషయాలపై బ్రిటన్ ప్రభుత్వంతో చర్చించాం’’ అని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత ఆదివారం కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు అకస్మాత్తుగా లండన్‌లోని భారతీయ రాయబార కార్యాలయంపై దాడికి దిగి త్రివర్ణ పతాకాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ బ్రిటన్ రాయబారి నుంచి వివరణ కూడా కోరింది.
‘‘కొన్ని దేశాలు తమ భద్రత విషయంలో ఓ రకంగా ఇతరుల ఆస్తుల విషయంలో మరో రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఇతరుల భద్రత విషయమై వారిలో శ్రద్ధ కనిపించడం లేదు. కానీ.. విదేశాంగ మంత్రిగా నేను ఈ తీరును అస్సలు అంగీకరించను’’ అని మంత్రి స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన బీజేపీ జాతీయ యువ మోర్చా యువ సంవాద కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు ప్రసంగించారు.